ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

29 Oct, 2019 00:45 IST|Sakshi
నగేశ్‌ కుకునూర్‌

‘‘సినిమా రాయడాన్ని పాత్రలు తయారు చేయడాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఫస్ట్‌ కాపీ సిద్ధమైనప్పుడు సాంకేతిక నిపుణులతో కలసి సినిమా చూస్తాను. నా సినిమాని ఫైనల్‌గా చూసేది కూడా అప్పుడే. ఆ తర్వాత జరిగేదాన్ని పట్టించుకోను. సినిమా ఎలా ఆడుతుంది? కలెక్షన్లు, రివ్యూలు పెద్దగా పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’తో దర్శకుడిగా మారిన ఈ తెలుగు దర్శకుడు కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 22 ఏళ్ల తర్వాత తెలుగులో తొలి చిత్రంగా  ‘గుడ్‌ లక్‌ సఖీ’ని తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రధారులు. సుధీర్‌ చంద్ర నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రవిశేషాలను నగేశ్‌ కుకునూర్‌ పంచుకున్నారు.

► నేను పక్కా హైదరాబాదీ. నేను దాచుకున్న సేవింగ్స్‌తో నా తొలి సినిమా ‘హైదరాబాద్‌  బ్లూస్‌’ చేశాను. నాన్న ప్రొడక్షన్‌ చూసుకున్నారు. అమ్మ కుక్, ఆంటీ కాస్ట్యూమ్స్‌ చూసుకున్నారు. మొదటిసారి స్క్రీన్‌ మీద నా పేరు చూసుకోగానే నేను దర్శకుడినయిపోయాను అని గర్వంగా ఫీల్‌ అయ్యాను. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’ చిత్రాన్ని అమెరికాలో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పంపుదాం అనుకుని ప్రింట్లను సూట్‌కేస్‌లో అమెరికా తీసుకెళ్లాను. అనుకోకుండా ముంబై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించాం. ప్రేక్షకులకు నచ్చింది. అక్కడే ఉండిపోయి సినిమాలు చేస్తున్నాను.

► నేను హిందీ రాయగలను, మాట్లాడగలను. అయితే తెలుగు మాట్లాడతాను. తెలుగు సినిమా చేయాలంటే భాష మీద పూర్తి అవగాహన ఉండాలనుకునేవాణ్ణి. నాకున్న పెద్ద చాలెంజ్‌ తెలుగు సినిమా చేయడం. హిందీలోనే ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చావురా బాబూ అని ప్రేక్షకులు అనుకోకూడదు. 

► కీర్తీ సురేష్‌తో వర్క్‌ చేయడం బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇందులో మేకప్‌ లేకుండా యాక్ట్‌ చేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాకి టైటిల్‌ ‘గుడ్‌లక్‌ సఖీ’ అనుకుంటున్నాం. 60 శాతం షూటింగ్‌ చేశాం. 25 రోజుల షూటింగ్‌ ఉంది. నాటకాలు వేసే కంపెనీలో పనిచేస్తుంటాడు ఆది. జగపతిబాబు కోచ్‌ పాత్రలో కనిపిస్తారు.

► నాకు ఇద్దరు దర్శకులంటే విపరీతంగా ఇష్టం. టాలీవుడ్‌లో కె. విశ్వనాథ్‌గారు, బాలీవుడ్‌లో రిషికేశ్‌ ముఖర్జీ. ఈ సినిమాలో ముఖర్జీగారి స్టయిల్‌ కనిపిస్తోంది. ఇది ఆడియన్స్‌ టేస్ట్‌కి నచ్చుతుందా లేదా? అని నేను చెప్పలేను. ఇప్పటికీ ఆడియన్స్‌కు ఏం నచ్చుతుందో నాకు తెలియదు.

► నా సినిమా నాకు బిడ్డలాంటిది. కథను తయారు చేయడానికి మానసికంగా, ఎమోషనల్‌గా చాలా శ్రమిస్తాం. ఎవ్వరైనా వచ్చినప్పుడు మీ బిడ్డ బాలేదు అంటే ఎవరికి నచ్చుతుంది? దర్శకులు విమర్శలను తీసుకోవాలి అంటారు? ఎందుకు తీసుకోవాలి? అది విమర్శ కాదు.. వాళ్ల అభిప్రాయం? నీ అభిప్రాయం ఎంత కరెక్ట్‌ అయినా నేను  వినదలచుకోలేదు. ఎవరి గురించైనా మంచి ఉంటే చెప్పండి. ఏదైనా చెడు చెప్పాలనుకుంటే మీలోనే ఉంచుకోండి. దానికి ఎటువంటి విలువ లేదు. 

► నా సినిమాలన్నీ నాకు నచ్చినట్టుగానే తీస్తాను. కొన్ని వర్క్‌ అవుతాయి.. కొన్ని అవ్వవు. పెద్ద పెద్ద స్టార్స్‌తో చేయాలని పరుగులు పెట్టను. నాకు స్టోరీ నరేషన్‌ ఇవ్వడం రాదు. రాసింది నా యాక్టర్స్‌కి ఇస్తాను. ‘మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం డిస్కస్‌ చేసుకుందాం’ అని చెబుతుంటాను. నేను సినిమాలు ఎక్కువగా చూడను. ట్రెండ్‌ని పట్టించుకోను. అప్‌డేట్‌ కాను. అప్‌డేట్‌ అవాల్సిన అవసరం కూడా లేదు. అప్‌డేట్‌ అయితే ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో దానికి తగ్గట్టు ఓ సినిమా చేస్తాం. ఆ లోపు వాళ్ల ఇష్టాలు మారిపోవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు