దర్శకుడు రాజ్‌ మోహన్‌ మృతి 

3 May, 2020 14:01 IST|Sakshi

సాక్షి, చెన్నై : యువ సినీ దర్శకుడు రాజ్‌ మోహన్‌ (47) గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.  అలైపిదళ్‌ అనే చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అయిన ఆయన  తాజాగా కేడయం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కాగా అవివాహితుడైన ఆయన స్వస్థలం కోవై. చాలా కాలం క్రితం చెన్నైకి వచ్చి పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. (నేను బాగానే ఉన్నాను)

కాగా స్థానిక కేకే నగర్‌లో నివశిస్తున్న రాజ్‌ మోహన్‌ లాక్‌ డౌన్‌ కారణంగా తన మిత్రుల ఇంటిలో భోజనం చేస్తూ వస్తున్నాడు. అలాంటిది కొన్ని రోజులుగా భోజనానికి రాకపోవడంతో మిత్రులు... ఆయన నివశిస్తున్న కార్యాలయానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు. దీంతో వాళ్లు కేకేనగర్‌ పోలీసులకు సమాచారం అందిం‍చారు.  రాజుమోహన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవ పంచనామా నిమిత్తం చెన్నై జీహెచ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో రాజు మోహన్‌ గుండెపోటుతో మృతి చెందినట్టు వెల్లడైంది. మరోవైపు  కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఆ పరీక్షలను కూడా నిర్వహించారు. అయితే ఆయనకు కరోనా వ్యాధి సోకలేదని తెలిసింది. రాజు మోహన్‌ మృతికి సంబంధించిన వివరాలను కోవైలోని ఆయన బంధువులకు సమాచారం అందించారు. కరోనా భయంతో బంధువులు ఎవరూ మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి ముందుకు రాలేదు. దీంతో మిత్రులే పోలీసుల సాయంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్)

మరిన్ని వార్తలు