మరో వారసురాలి తెరంగేట్రం

11 Jul, 2017 03:59 IST|Sakshi
మరో వారసురాలి తెరంగేట్రం

తమిళసినిమా: మరో నట వారసురాలు కథానాయకిగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురు కల్యాణి కథానాయకిగా తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రియదర్శన్, లిజీలకు కల్యాణి, సిద్ధార్థ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట ప్రియదర్శన్, లిజీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లిజీ సంరక్షణలోనే పెరుగుతున్నారు. న్యూయార్క్‌లో చదువు పూర్తి చేసిన కల్యాణి సినీరంగంపై ఆసక్తి కనబరుస్తోంది.

ఇప్పటికే విక్రమ్, నయనతార జంటగా నటించిన ఇరుముగన్‌ చిత్రానికి సహాయదర్శకురాలిగా పని చేసింది. కాగా కల్యాణిని కథానాయకి చేసే పనిలో ఆమె తల్లి లిజీ ముమ్మరంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా దర్శకుడు విక్రమ్‌కుమార్‌ దర్శక్వతం వహిస్తున్న తెలుగు చిత్రంలో యువ నటుడు అఖిల్‌కు జంటగా కల్యాణి ఎంపికయినట్లు తాజా సమాచారం. నాగార్జున నిర్మించనున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. మరో పది రోజుల్లో కల్యాణి ఈ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నట్లు సినీవర్గాల సమాచారం. కాగా విక్రమ్‌కుమార్‌ కల్యాణి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్‌ శిష్యుడన్నది గమనార్హం. అదే విధంగా కల్యాణి మరో మలయాళ చిత్రంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.