ఆ కష్టాలనుంచి పుట్టిన కథ

3 Feb, 2019 05:40 IST|Sakshi
ఉదయ్‌ కుమార్‌, రఘురాజ్‌

‘‘ఓ రోజు నేను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తున్నప్పుడు క్యాబ్‌లో రాసున్న ఓ కొటేషన్‌ గురించి క్యాబ్‌ డ్రైవర్‌ని అడిగా. ‘నేను బీటెక్‌ చదివాను. ఉద్యోగం దొరక్క నెలకి రూ.10 వేలకి క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తున్నా. నాలాంటి వాళ్లు చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.. ఇంజినీరింగ్‌కి విలువ  లేదు’ అని చెప్పగానే ఆశ్చర్యపోయా’’ అని డైరెక్టర్‌ రఘురాజ్‌ అన్నారు. ఈశ్వర్‌ హీరోగా, అంకిత, టువ హీరోయిన్లుగా ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే..’ అన్నది ఉపశీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రఘురాజ్‌ మాట్లాడుతూ– ‘‘నాతో పైవిధంగా అన్న క్యాబ్‌ డ్రైవర్‌తో కొన్నిరోజులు ట్రావెల్‌ చేసి, ఇంజినీరింగ్‌ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను.

అలా ఈ స్టోరీ పుట్టింది. ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌కి మా సినిమాలో ఒక మెసేజ్‌ కూడా ఉంటుంది. ‘లవ్‌ అట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటుంటారు. కానీ, అవన్నీ బ్రేకప్‌ అవుతున్నాయి. ‘లవ్‌ అట్‌ సెకండ్‌ లుక్‌’ అనే కొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. మా సినిమా యూత్‌కే కాదు.. పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరూ చేయని సాహసం మా సినిమాలో చేశాం. అది ఏంటన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. థాయిల్యాండ్‌లోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్‌ చేశాం. నేను ఏదడిగినా కాదనకుండా అన్నీ సమకూర్చుతూ మమ్మల్ని ముందుకు నడిపించిన మా నిర్మాతలు ఉదయ కుమార్, హేమలత గార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అన్నారు. నిర్మాత ఉదయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు