దేవుడు ఒకటి తీసుకుంటే మరోటి ఇస్తాడు

22 May, 2020 01:00 IST|Sakshi

‘‘దేవుడు మన దగ్గరి నుంచి విలువైనది ఏదైనా తీసుకున్నాడంటే మనల్ని ఉత్సాహపరచడానికి భారీ మోతాదులో మరోటి ఇస్తాడు’’ అన్నారు దర్శకుడు సెల్వ రాఘవన్‌. ‘పుదుపేటై్ట, 7/జీ రెయిన్‌బో కాలనీ (తెలుగులో 7/జీ బృందావన  కాలనీ), అయిరత్తిల్‌ ఒరువన్‌ (తెలుగులో యుగానికి ఒక్కడు), వెంకటేష్‌తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలు తీశారు సెల్వ.

ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలసి సోషల్‌ మీడియాలో ‘కైండ్‌నెస్‌ చాలెంజ్‌’లో పాల్గొన్నారాయన. ఈ సవాల్‌కి సై అన్నవాళ్లు ఏం చేయాలంటే.. తమ చిన్ననాటి ఫొటో ఒకటి పోస్ట్‌ చేసి, ఆ వయసులో ఎదురైన చేదు అనుభవాలకు ఇప్పుడు ధైర్యం చెబుతూ ఓ లేఖ రాయాలి. ఆ వయసులో ఉన్న చిన్ననాటి మనకి ఇప్పుడు మనం ఏదైనా సలహా ఇవ్వాల్సి వస్తే ఏమిస్తాం? అనేది ఆ చాలెంజ్‌. ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సెల్వ తన చిన్ననాటి (14 ఏళ్ల వయసులో దిగినది) ఫొటోను పోస్ట్‌ చేసి ఈ విధంగా రాసుకొచ్చారు.

‘‘ప్రియమైన సెల్వా (వయసు 14), ప్రపంచం నీ వైకల్యం (సెల్వకి ఒక కన్ను సరిగ్గా ఉండదు) చూసి నవ్వుతోంది. నీ కన్ను సరిగ్గా లేదని, సరిగ్గా చూడలేవని అందరూ నిన్ను విచిత్రంగా చూస్తారు. ప్రతి రాత్రి ఆ విషయాలను, ఆ అవమానాలను తలచుకొని నువ్వు ఏడుస్తూ ఉంటావు. దేవుడా... నన్ను ఎందుకు ఇలా చేశావు? అని ఆయన్ని ప్రశ్నిస్తావు. కానీ జీవితంలో ముందుకు వెళ్లడానికి భయపడకు. అధైర్యపడకు. సరిగ్గా పదేళ్లలో నువ్వో బ్లాక్‌బస్టర్‌ సినిమా రాసి, డైరెక్ట్‌ చేయబోతున్నావు. ఆ సినిమా నీ జీవితాన్ని మార్చేస్తుంది. అప్పుడు ఎంతో మంది నీవైపే చూస్తారు.

ఈసారి చిన్నచూపో, హేళన భావమో ఆ చూపులో ఉండదు. కేవలం గౌరవం, ఆరాధన ఉంటాయి. ఆ తర్వాత వరుసగా పదేళ్లు నువ్వు తీసే ప్రతి సినిమా క్లాసిక్‌ అంటారు. ట్రెండ్‌ సెట్టర్స్‌ అంటారు. నిన్నో మేధావి అంటారు. అప్పుడు నిన్ను  కంటి చూపుతో బాధపడ్డ కుర్రాడిగా ఎవరూ చూడరు. నీ సినిమాలతో వాళ్ల జీవితాల్లో ఏదో మార్పు తీసుకొచ్చిన దర్శకుడిలానే చూస్తారు. అందుకే అబ్బాయ్‌... భయపడకు. ధైర్యంగా ఉండు. ఫొటోలకు నవ్వుతూ పోజు ఇవ్వు. నువ్వు నవ్వుతున్న ఫొటో ఒక్కటి కూడా లేదు నా దగ్గర. త్వరలోనే నువ్వు చాలా ఫొటోలు దిగాలి. నిన్ను నువ్వు ప్రేమించు’.

ఇట్లు.. సెల్వ రాఘవన్‌ (వయసు 45).
ఈ లేఖలో ఇప్పటి 45 ఏళ్ల సెల్వరాఘవన్‌ అప్పటి 14 ఏళ్ల సెల్వాకి స్ఫూర్తి నింపే మాటలు చెప్పారు. ఈ మాటలు సెల్వాలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నవారికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ చాలెంజ్‌ ఆశయం అదే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు