అయ్యో: టాప్‌ దర్శకుడు భిక్షాటన చేస్తూ జీవనం!

11 Sep, 2018 21:17 IST|Sakshi

సాక్షి, పెరంబూరు : పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కంచి ఆలయంలో భిక్షాటన చేస్తూ.. దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుండటం సినీ పరిశ్రమను కలిచివేస్తోంది. అలనాటి మహానటుడు ఎంజీఆర్‌ హీరోగా ‘నమ్మనాడు’  వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జంబులింగం కొడుకు సెంథిల్‌నాథన్‌. దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖరన్‌ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన సెంథిల్‌ నాథన్‌.. ఆ తరువాత విజయకాంత్‌ నటించిన ‘పూందోట్ట కావల్‌క్కాన్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో వరుసగా పాలైవన్‌ రాజాక్కళ్, ఇళవరసన్‌ తదితర 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో 2009లో ‘ఉన్నై నాన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆయన ఎన్నో ఆర్థిక సమస్యలు, కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తరువాత సెంథిల్‌నాథన్‌ బుల్లితెరపై దృష్టి సారించినా.. అక్కడ విజయం సాధించలేకపోయారు.

స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సీరియల్‌ నుంచి ఆయనను ఇటీవల తొలగించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సెంథిల్‌నాథన్‌.. ఇంటిని వదిలి కంచికి వెళ్లిపోయారు. అక్కడి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు నిర్మాతలు ఆయన్ని సంప్రదించి చెన్నై‍కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వారు వెనుదిరిగారు. దీనిపై కాంచీపురం పోలీసులకు సమాచారం అందించారు. వారి సాయంతో సెంథిల్‌నాథన్‌ను చెన్నైకి తీసుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు