అవును... నాకు కోపమొస్తుంది

24 Nov, 2018 05:25 IST|Sakshi
దర్శకుడు శంకర్‌

సామాజిక సమస్యలకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి గ్రాండ్‌ విజువల్స్‌తో తెర మీద చూపిస్తారు దర్శకుడు శంకర్‌. ‘జెంటిల్‌మేన్‌’ నుంచి ‘ఐ’ వరకూ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన దర్శకుడిగా మనకు తెలుసు. కానీ శంకర్‌ సెట్లో ఎలా ఉంటారు? శంకర్‌కు కోపం వస్తుందా? కోపంతో మూడో కన్ను విప్పి ఉగ్ర శంకరుడౌతారా? మనకు తెలియదు. ఇదే ప్రశ్న శంకర్‌నే అడగ్గా – ‘‘అవును నాకు కోపం వస్తుంది అని సమాధానం ఇచ్చారు. కోపం రావడం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరుగుతాయి’’ అని అంటున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘సెట్లో ఏదైనా పని సరిగ్గా జరగకపోతే కోపం వస్తుంది.

చేసే పనిలో శ్రద్ధ లేకపోయినా, సక్రమంగా జరగకపోయినా కోపం వస్తుంది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా కోపం వచ్చేది.  విచిత్రంగా కోపం కొన్ని సార్లు పనులన్నీ సక్రమంగా జరిగేలానూ చేస్తుంది. మనం కోపంగా, చిరాకుగా ఉన్నాం అని మన చుట్టూ ఉన్నవాళ్లు చూస్తే ఆ పని చాలా ముఖ్యమైందని, త్వరగా పూర్తి చేయాలని పనులను త్వరగా పూర్తి చేస్తారు. మెల్లగా మెల్లగా కోప్పడటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయిపోయింది. కోపం తెచ్చుకోవడం కంటే ఏర్పడ్డ సమస్యకు పరిష్కారం వెతకడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం మొదలెట్టాను’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌తో శంకర్‌ తెరకెక్కించిన లేటెస్ట్‌ చిత్రం ‘2.0’ ఈ నెల 29న రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు