17 కథలు రెడీగా ఉన్నాయి

30 Sep, 2019 00:36 IST|Sakshi

‘‘నాలుగేళ్ల క్రితం ‘వై మేల్‌ ఈజ్‌ ఏ జోక్‌’ అనే వీడియో రూపొందించాను. సౌతిండియాలో వైరల్‌ అయిన తొలి వీడియో అది. ఆ వీడియోకి వచ్చిన ఒక కామెంట్‌ నాలో ఆసక్తి కలిగించింది. దాంతో రామాయణం మొత్తం చదివాను. సుమారు 8 వెర్షన్లు చదివాను. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రాముడు, సీత లాంటి పాత్రలుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే ‘రామ చక్కని సీత’ చిత్రాన్ని తీశాను’’ అని దర్శకుడు శ్రీహర్ష మండ అన్నారు. ఇంద్ర, సుకృత జంటగా శ్రీహర్ష తెరకెక్కించిన చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీహర్ష, ఫణి నిర్మించారు. గత శుక్రవారం ఈ సినిమా రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ – ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాణ్ణి.

‘నువ్వు ఇందులో బాగా రాణిస్తావు రా’ అని టీచర్లు మెచ్చుకునేవారు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. వీవీ వినాయ్‌గారు తీసిన ‘నాయక్‌’ సినిమాకు నేను చివరి అప్రెంటిస్‌ని. నేను ఆ సినిమాకి పని చేశా అని బహుశా వినాయక్‌గారికి కూడా తెలిసుండదు. ఆ తర్వాత దశరథ్‌గారి దగ్గర ‘శౌర్య’, ఓంకార్‌గారి దగ్గర ‘రాజుగారి గది 2’ సినిమా, ‘సిక్త్స్‌ సెన్స్‌’ అనే షోకు వర్క్‌ చేశాను. ఈ సినిమాను నా స్నేహితుడు ఫణితో కలసి నిర్మించాను. ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు, రివ్యూలు చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయని చెప్పడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర 17కథలు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా చేస్తాననేది త్వరలో చెబుతాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా