ప్రియాంక హత్యపై భావోద్వేగానికి లోనైన సుకుమార్‌

1 Dec, 2019 20:08 IST|Sakshi

హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మాయిలు ఎవరినీ నమ్మవద్దని సూచించారు. బాధితురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రియాంక దారుణ హత్యకు సంతాపంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రియాంక హత్య జరిగిన విషయం తెలుసుకుని చాలా మంది సంబంధం లేని వాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రిమినల్స్‌ మన మధ్య నుంచే పుట్టుకోస్తారు. దీనికి మనం అందరం బాధ్యులమే.

ప్రియాంక ఆ సమయంలో 100 కు ఫోన్ చేయాల్సిందని అందరూ చెబుతున్నారు. కానీ అమ్మాయి వాయిస్‌ చాలా సెన్సిటీవ్‌ ఉంది. నలుగురు అబ్బాయిలు హెల్ప్ చేస్తామని ట్రై చేస్తున్నారు.. అలాంటప్పుడు తాను 100కు ఫోన్ చేయడం ఏం బాగుంటుందని ఆమె భావించి ఉంటారు. సాయం చేయడానికి వస్తే పోలీసులను పిలుస్తావా అక్కా అని వాళ్లు అడిగితే ఏం చెప్పగలనని ప్రియాంక అనుకుని ఉండొచ్చు. అందుకే ఆమె పోలీసులకు ఫోన్‌ చేసి ఉండకపోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలను అంతగా నమ్ముతారు. మేం మగాళ్ళం కాదమ్మా.. మృగాళ్లం దయచేసి మమ్మల్ని నమ్మొద్దు. సొంత తండ్రి, అన్నలను కూడా నమ్మొద్దు. అనుమానం వస్తే పోలీసులకు ఫోన్‌ చేయండి. అవసరమైతే తరువాత సారీ చెప్పోచ్చు. అనుమానంతో బతకండి.. అప్పుడే మీరు భద్రంగా ఉండగలర’ని అమ్మాయిలకు సూచించారు. కాగా, ప్రియాంక దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు