లిప్ లాక్ సీన్ తీసేశాం!

17 Aug, 2014 23:18 IST|Sakshi
లిప్ లాక్ సీన్ తీసేశాం!

 ‘‘సందర్భోచితంగా లిప్ లాక్ సీన్ తీశాం. కానీ, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటంతో పంటి కింద రాయిలా ఉంటుందని తీసేశాం’’ అని ‘గాలిపటం’ చిత్రం దర్శకుడు నవీన్ గాంధీ అన్నారు. దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటితో కలిసి నిర్మించిన ‘గాలిపటం’ గతవారం విడుదలైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే అందరి ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందని నవీన్ గాంధీ చెబుతూ - ‘‘మాది అనంత్‌పూర్.
 
  అక్కడే చదువుకున్నా. ఎమ్‌ఏ సోషియాలజీ చేశాను. టీచర్‌గా చేయడంతో పాటు కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా చేశాను. అనంతరం  గోపీచంద్, రాఘవేంద్రరావు, రాజమౌళి దగ్గర పనిచేశాను. ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ తీసిన వాణిజ్య ప్రకటనలకు సహాయ దర్శకునిగా కూడా చేశాను. నేను, సంపత్ నంది రూమ్ మేట్స్. దర్శకుడు కావాలనే తన ఆశయం ముందు నెరవేరింది. ‘గాలిపటం’తో నా కల కూడా ఫలించింది’’ అని చెప్పారు.
 
  ‘గాలిపటం’ క్లయిమాక్స్ చాలా బోల్డ్‌గా ఉందనేవారికి మీ సమాధానం అనడిగితే - ‘‘కొంచెం అడ్వాన్డ్స్‌గా ఉందని చాలామంది అన్నారు. దాన్ని ప్రశంసలా తీసుకున్నాం. ఓ పది, ఇరవయ్యేళ్ల తర్వాత ఎలా ఉంటుందో చూపించాం. ఈ కథకు ఆ ముగింపే కరెక్ట్. నేటి తరం స్వేచ్ఛగా ఉండాలని భావిస్తున్నారు. దాన్నే చూపించాం’’ అన్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తానని నవీన్ తెలిపారు.