రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

3 Sep, 2019 11:14 IST|Sakshi

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘రాజుగారి గ‌ది 3’ ఫ‌స్ట్ లుక్‌ని వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు. రాజుగారిగ‌ది, రాజుగారిగ‌ది 2 చిత్రాల త‌ర్వాత ఓంకార్ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రంలో తెర‌కెక్కుతోంది. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది. డ‌బ్బింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ష‌బీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల సంద‌ర్భంగా  దర్శకుడు వినాయ‌క్ మాట్లాడుతూ... ‘రాజుగారి గ‌ది, రాజుగారి గ‌ది 2 చిత్రాల కంటే రాజుగారిగ‌ది 3 చాలా పెద్ద హిట్ కావాలి. ఓంకార్‌ చాలా క‌ష్టప‌డి క‌మిట్‌మెంట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా న‌టిస్తున్నాడు. ఓంకార్‌ ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఎంత పెద్ద బ్యాన‌ర్ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యాన‌ర్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ప‌నిచేసిన ఛోటా కె.నాయుడు స‌హా యూనిట్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అన్నారు.
ద‌ర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ... ‘రాజుగారిగ‌ది సినిమా చేసేట‌ప్పుడు ఆ సినిమా గురించి ఎవ‌రికీ పెద్దగా తెలియ‌దు. అప్పుడు వినాయ‌క్ అన్నయ్య చేతుల మీదుగా వినాయ‌క‌చ‌వితిరోజునే టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. దాని ద‌శ మారిపోయింది. బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు వినాయ‌క్ అన్నయ్య చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా అనిపించింది. రాజుగారిగ‌ది, రాజుగారిగది 2 చిత్రాల కంటే ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మకం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్టర్ ష‌బీర్ స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్స్ అలాగే అశ్విన్‌, అవికా, అలీ గారు, బ్రహ్మాజీ గారు, ఊర్వశి గారు ఇలా అంద‌రూ వారి సొంత సినిమాగా భావించి చేయ‌డం వ‌ల్ల సినిమా చాలా బాగా వ‌చ్చింది. అన్నీ కుదిరితే ఈ ద‌స‌రాకు ప్రేక్షకుల ముందుకు వ‌స్తాం’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా