ద్వితీయ విఘ్నం దాటారండోయ్‌

26 Dec, 2019 00:44 IST|Sakshi
బ్రోచేవారెవరురా లో శ్రీవిష్ణు, రాహుల్, ప్రియదర్శి; జెర్సీ లో నాని; మజిలీ లో నాగచైతన్య

ఇండస్ట్రీలో ఒక గమ్మల్తైన గండం ఉంది. ఫస్ట్‌ సినిమా ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయినా కూడా రెండో సినిమాకు తడబడుతుంటారు దర్శకులు. సినిమా భాషలో దీనికి ‘సెకండ్‌ మూవీ సిండ్రోమ్‌’ అనే పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీలో ఇది తరచూ కనిపించేదే. దర్శకులు మొదటి సినిమాతో ఎంతలా మెప్పించినా, రెండో సినిమాతో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు దర్శకులు మాత్రం సెకండ్‌ హిట్‌ కూడా ఇచ్చేస్తారు. అలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొందరు దర్శకులు ఈ ఏడాది తమ రెండో సినిమాతో వచ్చారు. కానీ ముగ్గురు దర్శకులు మాత్రం ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేశారు. ఈ ‘సెకండ్‌ మూవీ సిండ్రోమ్‌’ను సక్సెస్‌ఫుల్‌గా దాటేసిన సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌ స్టోరీ.

శివ మజిలీ
‘నిన్ను కోరి’ (2017) సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు శివ నిర్వాణ. ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని ముందుకు సాగించొచ్చు అని ‘నిన్ను కోరి’లో చెప్పారు. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, టేకింగ్,  పాటలు, ఫెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా సక్సెస్‌ కొట్టింది. రెండో సినిమాగా టాలీవుడ్‌ యంగ్‌ కపుల్‌ నాగచైతన్య, సమంతలతో ‘మజిలీ’ తీశారు శివ నిర్వాణ.

వివాహం తర్వాత చైతన్య, సమంత స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చిత్రమిదే. మనం కోరుకున్నవాళ్లు మనకు కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మనల్ని కోరుకునేవాళ్లూ మనకోసం ఉండే ఉంటారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు శివ. ఎమోషనల్‌ మీటర్‌ కరెక్ట్‌గా వర్కౌట్‌ అయింది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత గుర్తుంచుకునే చిత్రం అయింది. ప్రస్తుతం తన తొలి హీరో నానీతో ‘టక్‌ జగదీష్‌’ చేస్తున్నారు శివ.


మళ్ళీ హిట్‌
మొదటి చిత్రానికి ప్రేమకథను ఎన్నుకున్నారు గౌతమ్‌ తిన్ననూరి. కథను చెప్పడంలో, కథను ఎంగేజ్‌ చేయడంలో తనదైన శైలిలో ‘మళ్ళీ రావా’ని తెరకెక్కించారు. ఇందులో సుమంత్, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటించారు.

మన ఫస్ట్‌ లవ్‌ మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తే? ఆమెను వదులుకోకూడదనుకునే ఓ ప్రేమికుడి ప్రయాణమే ఈ సినిమా. ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాగా నానీతో ‘జెర్సీ’ని తెరకెక్కించారు గౌతమ్‌. వందమందిలో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్కడి గురించి అందరూ చర్చించుకుంటారు. మిగతా 99 మందికి సంబంధించిన కథే ‘జెర్సీ’. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెటర్‌గా టీమ్‌లో సెలక్ట్‌ కావాలనుకున్న ఓ ప్లేయర్‌ కల నెరవేరిందా లేదా అనేది కథ. నాని కెరీర్‌లో మైలురాయిగా ఈ సినిమా ఉండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు గౌతమ్‌ తిన్ననూరి.

 

నో కన్‌ఫ్యూజన్‌
‘దర్శకుడిగా వివేక్‌ ఆత్రేయకు ‘మెంటల్‌ మదిలో’ తొలి సినిమా. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్‌ జంటగా నటించారు. ఏ సందర్భంలో అయినా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే కన్‌ఫ్యూజ్‌ అయ్యే మనస్తత్వం హీరోది. అలాంటి అతను లైఫ్‌ పార్ట్‌నర్‌ని ఎలా ఎంచుకున్నాడన్నది కథ. హీరో కన్‌ఫ్యూజ్డ్‌ అయినప్పటికీ ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ కాకుండా బావుందనేశారు. దాదాపు అదే టీమ్‌తో  ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కించారు వివేక్‌. క్రైమ్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా  వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్‌. ప్రస్తుతం మూడో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

ఈ ముగ్గురు దర్శకులూ ద్వితీయ విఘ్నాన్ని దాటేశారు. ప్రస్తుతం మూడో సినిమా పనిలో ఉన్నారు. మూడో హిట్‌ని కూడా ఇస్తే ‘హ్యాట్రిక్‌ డైరెక్టర్స్‌’ అనిపించుకుంటారు.
– గౌతమ్‌ మల్లాది

మరిన్ని వార్తలు