సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు!

19 Apr, 2020 07:42 IST|Sakshi

బాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఉత్తరాఖండ్‌ అందాల సుందరి దిశా పటాని. మన తెలుగు సినిమా ‘లోఫర్‌’తో వెండితెరకు ‘మౌని’గా పరిచయమైన దిశ ఆ తరువాత తన దృష్టిని బాలీవుడ్‌పై కేంద్రీకరించింది. ‘యం.యస్‌.ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో కమర్షియల్‌ బ్రేక్‌ తెచ్చుకుంది. ‘బాఘీ’, ‘భరత్‌’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ‘రాధే’ సినిమాతో మరోసారి సల్మాన్‌ఖాన్‌తో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు ఆమె మాటల్లోనే..

అవునా? నేనేనా!
మొదట్లో నేను కాస్త సిగ్గరిని. నలుగురిలో కలవడానికి ఉత్సాహం చూపించేదాన్ని కాదు. ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ కావాలనుకున్నాను. ఎందుకో నా మనసు సినిమాలపైకి  మళ్లింది. అంతే, చదువును మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. నిజానికి సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు! నాకు నటన, ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. అయితే పరిస్థితులే అన్నీ నేర్పించాయి. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా సొంతంగా నిలదొక్కుకొని ఇండస్ట్రీలో తగిన గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే యాక్షన్‌ ఫిల్మ్స్, సూపర్‌ హీరో ఫిల్మ్స్, హారర్‌ ఫిల్మ్స్‌... అంటే నాకు చాలా ఇష్టం.

అది నిజం కాదు
రాశి కంటే వాసి ముఖ్యమని నమ్ముతాను. ఎడాపెడా నటించాలని లేదు. తక్కువ సినిమాల్లో నటించినా ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక సినిమా ఫ్లాప్‌ అయితే నాకు మరో అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు గాడ్‌ఫాదర్‌లు కూడా ఎవరూ లేరు. కాబట్టి నేను ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం అని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా స్క్రిప్ట్‌తో పాటు అందులో నా పాత్ర కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ విషయంలో మాత్రం నాకు స్వార్థం ఉంది! సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరించే ధోరణి వల్ల నా కెరీర్‌ స్లో అనే భావన కలుగుతుంది. కానీ అది నిజం కాదు.

నేను రెడీ
కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించాలని నాకు కూడా ఉంది. దురదృష్టవశాత్తు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ‘‘అమ్మాయిలు ఫైట్లు చేయడం ఏమిటి? విడ్డూరం కాకపోతేనూ!’’ అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా అమ్మాయిలు ఫైట్లు చేయడాన్ని ఊహించలేకపోతున్నారు. ‘టైగర్‌ జిందా హై’ సినిమాలో కత్రినా కైఫ్‌ కొంత యాక్షన్‌ పార్ట్‌ చేసింది. అయితే పూర్తి స్థాయిలో యాక్షన్‌ సినిమా రావాల్సి ఉంది. ఏది ఏమైనా... ప్రేక్షక సమాజం ఆమోదం లభిస్తే వుమెన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌లు వరుస కడతాయి... అందులో సందేహం లేదు.

గొప్ప కథకుడు!
లెజెండ్‌ జాకీచాన్‌తో కలిసి ‘కుంగ్‌ ఫూ యోగా’ సినిమాలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం ఓపెన్‌ ఆడిషన్‌ జరిగింది. ‘యాక్షన్‌ చేయగలరా?’ అంటూ ఒక లాంగ్‌ సీన్‌ ఇచ్చారు. నేను చేసి చూపించాను. వారికి నచ్చింది. ఆ సమయంలోనే నా జిమ్నాస్టిక్స్‌ వీడియోలు వారికి చూపించాను. జాకీచాన్‌ అందరితో బాగా కలిసిపోయేవారు. స్పాట్‌బాయ్‌ నుంచి లైట్‌బాయ్‌ వరకు ప్రతిరోజు సెట్‌లో ఉన్నవారి కోసం చాక్లెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు తెచ్చేవారు. తన అనుభవాలను పంచుకోవడం, కథలను డ్రామా, యాక్షన్‌తో కలిపి చెప్పడం ఆయనకు ఇష్టం. ఈ భూప్రపంచంలో జాకీచాన్‌ గొప్ప కథకుడు అని నా నమ్మకం. 

మరిన్ని వార్తలు