శ్రుతి పోయె... దిశ వచ్చె!

22 Oct, 2017 01:07 IST|Sakshi

...టామ్‌ టామ్‌ టామ్‌! తమిళ దర్శకుడు సుందర్‌. సి డ్రీమ్‌ ఫిల్మ్‌ ‘సంఘమిత్ర’ కథానాయిక గురించి మళ్లీ ఇంకోసారి టముకు వేసే ఛాన్స్‌ లేదు. రాదు కూడా. దిసీజ్‌ ఫైనల్‌ అండ్‌ పక్కా! ‘సంఘమిత్ర’లో రాణీ సంఘమిత్రగా దిశా పాట్నీ నటిస్తారని చిత్రబృందం వెల్లడించింది. శ్రుతీహాసన్‌ ‘సంఘమిత్ర’గా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సిన్మా మొదలైంది. కత్తి యుద్ధం తదితర అంశాల్లో కొన్ని రోజులు శ్రుతి లండన్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నారు కూడా! కానీ, ఎక్కడో తేడా వచ్చింది.

చిత్రబృందానికీ, శ్రుతికీ సెట్‌ కాలేదు. దాంతో ‘బౌండ్‌ స్క్రిప్ట్‌ ఇవ్వలేదు. షెడ్యూల్‌ డీటెయిల్స్‌ చెప్పలేదు’ అని ‘సంఘమిత్ర’ దర్శక–నిర్మాతలపై ఆరోపణలు చేశారామె. చివరకు, శ్రుతికి ‘సంఘమిత్ర’ టీమ్‌ స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వడంతో సైలెంట్‌ అయ్యారనుకోండి. ఈ మధ్యలో ‘శ్రుతి పోయె... హన్సిక వచ్చె! టామ్‌ టామ్‌ టామ్‌’ అంటూ చెన్నై కోడంబాక్కమ్‌లో టముకు వేశారు. తర్వాత ‘కొన్నాళ్లకు లేదు లేదు... హన్సిక కాదు... అనుష్క వచ్చె’ అన్నారు.

కొన్నాళ్లకు ‘...కాజల్‌ వచ్చె’ అని టముకు వేశారు. వాళ్లెవరూ ‘సంఘమిత్ర’లోకి రాలేదు. దిశా పాట్నీ వచ్చి చేరారు. తెలుగులో ‘లోఫర్‌’, హిందీలో ‘ఎం.ఎస్‌. ధోని’ చిత్రాల్లో నటించిన దిశ.. ప్రస్తుతం హిందీలో ‘బాఘి–2’ చేస్తున్నారు. త్వరలో ‘సంఘమిత్ర’ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో ‘జయం’ రవి, ఆర్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా