కండల కోసం ఒళ్లు అలిసే కసరత్తులు అక్కర్లేదు: నాగార్జున

9 Sep, 2013 14:00 IST|Sakshi
కండల కోసం ఒళ్లు అలిసే కసరత్తులు అక్కర్లేదు: నాగార్జున

ఆయన వయసు 54. కొడుకులు కూడా హీరోలుగా చేస్తున్నారు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా.. కుర్రహీరోలతో పోటీపడుతూ సమానంగా స్టెప్పులేస్తారు, ముఖంలో ఎక్కడా ఒక్క ముడత కూడా కనిపించదు. నవ మన్మధుడిలా అశేష ఆంధ్ర ప్రేక్షకులను అలరిస్తున్న ఆయనెరో కాదు.. అక్కినేని నాగార్జున. దాదాపు రెండు దశాబ్దాలకు పైబడి రోజూ వ్యాయామం చేస్తూ తన అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకుంటున్న కింగ్ నాగ్.. వినాయక చవితి సందర్భంగా ఐఏఎన్ఎస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

కండలు పెంచాలంటే విపరీతంగా ఒళ్లు అలిసేంత వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. వ్యాయామాల వల్ల ఉపయోగం ఉండొచ్చు గానీ, వాటిని ఆపగానే మళ్లీ మామూలైపోతుందని, అలా కాకుండా రోజుకు కొంతసేపటి పాటు ప్రతిరోజూ చేస్తే మంచిదని.. తానలా 25 ఏళ్ల నుంచి చేస్తున్నానని చెప్పారు. రోజు ఉదయం గంట చొప్పున వారానికి ఆరు రోజులు ఎక్సర్సైజ్ చేస్తానని, దాంతోపాటు తగినంత నిద్ర, కావల్సినంత నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమని తెలిపారు. వీటన్నింటితో పాటు చేసే పనిని ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యమన్నారు. దీనివల్ల మనసు చాలా సౌఖ్యంగా ఉండి, శరీరం కూడా బాగుంటుందన్నారు.

ఇటీవలే ఢమరుకం చిత్రం కోసం నాగార్జున సిక్స్ ప్యాక్ చేశారు. దీనికోసం తాను డైటింగ్ ఏమాత్రం చేయలేదని, తనకు కావల్సినదంతా ఎప్పటికప్పుడు తినేస్తుంటానని, పైపెచ్చు తనకు రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయని చెప్పారు. కండలు పెంచాల్సి వచ్చినప్పుడు జిమ్కు వెళ్లి తనకు తానే మంచి వ్యాయామాలు ఎంచుకుంటానన్నారు. రిటైర్మెంట్ గురించిన ఆలోచన అస్సలు తన మదిలోనే లేదని స్పష్టం చేశారు. అమితాబ్ బచ్చన్లా వేర్వేరు పాత్రలు ధరించాలన్నదే తన ఉద్దేశమని, ప్రస్తుతం సినిమా భారం మొత్తాన్ని తన భుజాల మీద మోస్తున్నట్లుగా చేయాల్సిన అవసరం లేనప్పుడు అమితాబ్ లాంటి పాత్రలు ధరిస్తానని తెలిపారు. మల్టీస్టారర్ సినిమాల్లో కారెక్టర్ పాత్రలు ధరించడానికి కూడా తానెప్పుడూ సిద్ధమేనన్నారు. వందో సినిమా కూడా దగ్గర పడుతోందని, అసలిన్ని చిత్రాలు చేస్తానని తాను అనుకోనే లేదని అన్నారు.