బహుమతులు తీసుకురాకండి

28 May, 2014 22:54 IST|Sakshi
బహుమతులు తీసుకురాకండి


 ‘‘విజయ్ చాలా మంచి వ్యక్తి. తనతో జీవితాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని అమలాపాల్ చెప్పారు. తమిళ దర్శకుడు విజయ్‌తో అమలా వివాహం వచ్చే నెల 12న చెన్నయ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కాబోయే దంపతులు చెన్నయ్‌లో పాత్రికేయులను ప్రత్యేకంగా కలిశారు. అందరికీ ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు. ఆ  పత్రికతో పాటు మరో ప్రత్యేకమైన పత్రికను కూడా పొందుపరిచారు. అందులో... ‘‘మీ రాక మాకు విలువైన బహుమతి వంటిది. అందుకని ప్రత్యేకంగా బహుమతులు తేవద్దు. పూల గుత్తులకు డబ్బులు ఖర్చుపెట్టొదు. మేం ‘ఎబిలిటీ ఫౌండేషన్’ అనే సేవా సంస్థకు మా వంతు సహకారం అందిస్తున్నాం.
 
 మా పెళ్లికేదైనా కానుక ఇవ్వాలనుకుంటే మీరు ఆ సంస్థకు విరాళం ఇవ్వొచ్చు. అప్పుడు మాకన్నా ఆనందపడేవాళ్లు ఉండరు’’ అని విజయ్, అమలా కోరారు. పెళ్లయిన తర్వత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని, అసలా తీరిక కూడా లేదని విజయ్ తెలిపారు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేస్తానని, కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని అమల స్పష్టం చేశారు. పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘త్వరలోనే అమ్మానాన్న కూడా కావాలనుకుంటున్నాం’ అని విజయ్ అన్నారు.