7న ‘కాలా విడుదలయ్యేనా?

25 May, 2018 09:00 IST|Sakshi

తమిళసినిమా: జూన్‌ 7న కాలా చిత్రం తెరపైకి రావడం ఖాయం కాదా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. 2.ఓ చిత్రం మాదిరిగానే కాలా చిత్రానికి అడ్డంకులు ఎదురై నిర్మాతలను ఇబ్బందికి గురిచేస్తున్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలే ఈ రెండూ కావడం విశేషం. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న బ్రహ్మాండ భారీ బడ్జెట్‌ చిత్రం 2.ఓ. ఈ చిత్ర నిర్మాణం మొదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకునే చాలా కాలం అయినా నిర్మాణాంతర కార్యక్రమాల్లో(గ్రాఫిక్స్‌) జాప్యం కారణంగా ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీని వాయిదా వేయాల్సిన పరిస్థితి. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసినా, అది కాస్తా ముందుగానే సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అవడంతో శంకర్‌ ఆ ట్రైలర్‌ను మూట కట్టి అటకెక్కించి కొత్తగా టీజర్‌ను రెడీ చేశారు. దీన్ని ఐపీఎల్‌ ఫైనల్‌ వేదికపై విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు, అయితే ఇటీవల తూత్తుక్కుడిలో స్టెర్‌లైట్‌ కాల్పులు తమిళనాడును అతలాకుతలం చేయడంతో 2.ఓ చిత్ర యూనిట్‌ తన ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది.

ఇక రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం కాలా. దీన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మించడం విశేషం కాగా, కబాలి చిత్రం ఫేమ్‌ పా.రంజిత్‌ దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందు చిత్రీకరణ పూర్తి చేసుకున్న 2.ఓ చిత్రం గ్రాఫిక్స్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ధనుష్‌ కాలా చిత్రాన్ని ముందు విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గత ఏప్రిల్‌ 27న కాలా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు కూడా. అయితే ఆ సమయంలో చిత్ర పరిశ్రమ సమ్మె కాలా విడుదలకు అడ్డుపడింది. దీంతో జూన్‌ 7వ తేదీకి చిత్ర విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. ఇక ఈ తేదీ మారే అవకాశం లేదులే అనుకుంటున్న సమయంలో తూత్తుక్కుడిలో స్టెర్‌లైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో పోలీసుల కాల్పులు, అమాయక ప్రజలను బలిగొనడం వంటి సంఘటనలతో ఇప్పుడు తమిళనాడు ఆగ్రహ జ్వాలలతో రగులుతోంది.

రాజకీయ రంగప్రవేశానికి పునాదులు వేసుకుంటున్న రజనీకాంత్‌ ఈ సమయంలో కాలా చిత్రాన్ని విడుదల చేయడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఐపీఎల్‌ ఫైనల్‌ వేదికపై నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు గానే కాలా చిత్ర తెలుగు వెర్షన్‌ ఆడియోను ఈ వారంలో నిర్వహించాలన్న ప్రణాళికలోనూ మార్పులు చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాలా చిత్ర విడుదల జూన్‌ 7వ తేదీ ఉంటుందా? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతోంది. విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల విడుదల రజనీకాంత్‌ రాజకీయ జీవితానికి ముడి పడిఉన్నాయన్నది. ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి గత ఏడాది డిసెంబర్‌ 31వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రజనీకాంత్‌ నటించిన రెండు చిత్రాల విడుదలకు ఏదో ఒక రూపంలో అవాంతరాలు వస్తున్నాయన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు