అంతకుమించిన సంతోషం లేదు

4 Feb, 2019 02:10 IST|Sakshi
ప్రశాంత్‌ వర్మ, రాజశేఖర్, జీవిత, సి.కల్యాణ్, శివాని, శివాత్మిక

– రాజశేఖర్‌  

‘‘లోకంలో ఎవరికైనా పని దొరకడమన్నదే గ్రేట్‌. దానికంటే సంతోషమైన విషయం ఏదీ  ఉండదు. నాకు పని కల్పించి, నాతో పని చేయించుకుంటూ సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అని రాజశేఖర్‌ అన్నారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్‌ విల్సన్‌ కథానాయికలుగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. నేడు రాజశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ సినిమా తర్వాత ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించి, ఈ కథ ఓకే చేశాం. ‘గరుడవేగ’ కి ప్రవీణ్‌ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్‌ అయ్యానో, ప్రశాంత్‌ వర్మతోనూ అంతే కొత్తగా ఫీల్‌ అవుతున్నా’’ అన్నారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘శేషు’ తర్వాత రాజశేఖర్‌గారితో నేను చేస్తున్న చిత్రమిది. నేను చిన్న సినిమాలు చేసేటప్పుడు లైట్స్‌ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఓ తమిళ హిట్‌ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొని, నన్ను నిర్మాతను చేశారు జీవిత–రాజశేఖర్‌ దంపతులు’’ అన్నారు. ‘‘అ!’ చిత్రానికి ముందే ‘కల్కి’ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, కుదరలేదు. ఒక ఫ్రాంచైజీ తరహాలో ఈ సినిమాకు సీక్వెల్స్‌ చేయాలనుంది.

అన్నీ కుదిరితే రాజశేఖర్‌గారి తర్వాతి బర్త్‌ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్‌గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను ‘యాంగ్రీ స్టార్‌’ అనే బిరుదు ఇస్తున్నా’’ అన్నారు ప్రశాంత్‌ వర్మ. ‘‘గరుడవేగ’ కి ముందు మళ్లీ సక్సెస్‌లోకి వస్తామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనుక ఎన్ని కోట్లు ఉన్నా కెరీర్‌ని కొనలేం. అటువంటి సమయంలో ‘గరుడవేగ’ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా మాట్లాడుతుండటంతో సంతోషంగా ఉంది’’ అన్నారు జీవిత. శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్‌ దాశరథి శివేంద్ర, ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్రపాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు