ఆ రెండు చిత్రాలకూ పారితోషికం తగ్గించుకున్నాను!

29 Mar, 2014 23:59 IST|Sakshi
ఆ రెండు చిత్రాలకూ పారితోషికం తగ్గించుకున్నాను!

దక్షిణాదిన ‘మోస్ట్ వాంటెడ్’ అనిపించుకున్న తర్వాత ఏ హీరోయిన్‌కైనా తదుపరి లక్ష్యం ‘బాలీవుడ్’ మీద ఉంటుంది. కానీ, సమంతకు మాత్రం అలాంటి ఆశయాలేవీ లేవు. ‘‘హిందీ సినిమాలు చేస్తే, మార్కెట్ పెరుగుతుంది కదా?’’ అనడిగితే... ‘‘తెలుగు, తమిళ భాషల్లో నా మార్కెట్ బాగానే ఉంది కదా’’ అని సమంత చెబుతారు. తమన్నా, కాజల్ అగర్వాల్‌లాంటివాళ్లు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా? అని ఓ ఆంగ్ల పత్రిక సమంతను అడిగితే -‘‘నేనిక్కడి అమ్మాయిని కాబట్టి, తమిళ సినిమాలు ఎక్కువగా చేయాలని ఉంటుంది. వాళ్లు ముంబయ్ నుంచి వచ్చినవాళ్లు కాబట్టి, హిందీ సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. కానీ, బాలీవుడ్ పై నాకు దృష్టి లేదు. నాకిక్కడ మంచి మంచి అవకాశాలొస్తున్నాయి. మనకు కథానాయికల కొరత కూడా ఉంది. అలాంటప్పుడు నేనిక్కడ్నుంచి ఎందుకు వెళ్లడం’’ అన్నారు. ఇక్కడైతే ‘నంబర్ వన్’ అనిపించుకోవచ్చనే ఆలోచన కూడా ఉందా? అన్న ప్రశ్నకు -‘‘నంబర్ గేమ్‌ని నమ్మను. ప్రతి శుక్రవారం ఓ సినిమా విడుదలవుతుంది.
 
  ఏ సినిమా హిట్టయితే, అందులో నటించిన కథానాయిక ‘నంబర్ వన్’ అవుతుంది. వారానికి మారిపోయే స్థానం గురించి ఆలోచించడం వృథా. నేనెవరితోనూ పోటీపడను. మంచి పాత్రలు చేయాలనుకుంటాను. నటిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉందనిపించిన సినిమాలకు పారితోషికం తగ్గించుకోవడానికి వెనకాడను. ఈగ, ఏమిటో ఈ మాయ చిత్రాలే అందుకు ఉదాహరణ’’ అని చెప్పారు.
 

>