లచ్మికి గొంతిచ్చిన అమ్మాయి

9 Apr, 2018 00:36 IST|Sakshi
జ్యోతి వర్మ, ‘రంగస్థలం’లో సమంత

‘ఆ... పేమంటే ఇంతే మరి ఇలాగే సెప్తారు. నీకినపడదని ఓ అరిసి సెప్పరు’ అని సమంత ‘రంగస్థలం’ చిత్రంలో రామ్‌చరణ్‌తో అంటుంది. ఇంతవరకు సమంతకు చెప్పిన గొంతులా లేదే, అయినా కొత్త గొంతు కూడా బాగుందే అనుకున్నారు సమంత అభిమానులు. ఆ కొత్త గొంతు పేరు జ్యోతి వర్మ.‘నచ్చావులే’ చిత్రంతో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేసిన జ్యోతి వర్మకు ‘రంగస్థలం’ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సందర్భంగా జ్యోతివర్మ చెప్పిన మాటలు...

మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. మా ఇంట్లో వారంతా సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఫీల్డ్‌లో ఉండటంతో మా ఇంట్లో ఎప్పుడూ సినిమా డిస్కషన్స్‌ జరుగుతుండేవి. అలా నేను సినిమా మాటలు వింటూ పెరిగాను. ఇంటర్‌ చదువుతుండగా సినిమా ఆర్టిస్టునవుదామని మేం హైదరాబాద్‌ వచ్చాం. మా నాన్నగారి ఫ్రెండ్‌ జగదీశ్వర్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌. ఆయన నా గొంతు విని డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ప్రయత్నించమన్నారు. వాయిస్‌ టెస్ట్‌కి వెళ్లాను. నాకు ఏమీ తెలియకపోయినా ధైర్యంగా గబగబ చదివి వచ్చేసాను. వారం రోజుల తర్వాత సెలక్ట్‌ అయినట్టు కబురు వచ్చింది. అప్పటి నుంచి డబ్బింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టాను.

మొట్టమొదటగా...
‘నచ్చావులే’ సినిమాలో ఒక ఫ్రెండ్‌ క్యారెక్టర్‌కి మొట్టమొదటగా డబ్బింగ్‌ చెప్పాను. ఆ తర్వాత ‘వేదం’ చిత్రంలో అనుష్కకి చెప్పడంతో బ్రేక్‌ వచ్చింది. అందులో అనుష్క చాలా నిర్లక్ష్యంగా ఉండే ఒక ప్రాస్టిట్యూట్‌. అందువల్ల ఆ పాత్రకు నేను చెప్పిన డబ్బింగ్‌ను చూసి నా వాయిస్‌ రొమాంటిక్‌గా, జీరగా ఉంటుందనుకుని అటువంటి పాత్రలకు నాతో డబ్బింగ్‌ చెప్పించారు. అన్నీ అలాంటి పాత్రలనేసరికి డబ్బింగ్‌ చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డాను. అయితే నెమ్మది నెమ్మదిగా అందరి అభిప్రాయాన్ని బ్రేక్‌ చేసాను. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో ‘రకుల్‌ ప్రీత్‌ సింగ్‌’ కి, రెబల్‌ చిత్రంలో ‘దీక్షాసేథ్‌’కి చెప్పే అవకాశం వచ్చింది. క్రమంగా సినిమాలకు చెబుతూనే, సీరియల్స్‌కు కూడా డబ్బింగ్‌ చెబుతూ చాలా బిజీ అయిపోయాను. పర్సనల్‌ లైఫ్‌కి దూరమవుతున్నానని ప్రస్తుతం సీరియల్స్‌కి బ్రేక్‌ ఇచ్చేసాను. ఇప్పటివరకు మొత్తం 25 సినిమాలలో హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పాను.

పరకాయప్రవేశం...
సినిమాలలో డబ్బింగ్‌ చెప్పేటప్పుడు మన మూడ్‌ ఎలా ఉన్నా అక్కడకు వెళ్లాక పరకాయ ప్రవేశం చేయాలి. తప్పదు. ఒక్కోసారి ఇటువంటి ఇబ్బందులు అధిగమించలేకపోతాం. ‘నాయకి’ సినిమాలో త్రిషకు డబ్బింగ్‌ చెప్పాల్సిన రోజు మనసు సరిగ్గా లేకపోవడంతో ఎన్ని టేకులు తీసుకున్నా ఓకే అవ్వలేదు. మరుసటి రోజు ఉదయం సింగిల్‌ టేకులో డబ్బింగ్‌ పూర్తి చేసేసాను. సమంతకు నేను డబ్బింగ్‌ చెప్పిన మొట్టమొదటి సినిమా ‘రంగస్థలం’. ఆఖరు సినిమా కూడా ఇదే. ఇక రాబోయే చిత్రాలలో సమంత స్వయంగా తానే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నట్లు ప్రకటించారు కదా!

రంగస్థలంలో అవకాశం...
‘రంగస్థలం’ సినిమాలో గోదావరి యాసలో ఒక నాటు పాత్రకు డబ్బింగ్‌ చెప్పాలని పిలిపించారు. వాయిస్‌ టెస్ట్‌కి వెళ్లాను. దర్శకులు సుకుమార్‌కి నా గొంతు బాగా నచ్చింది. అలా ఆ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి సమంత స్వయంగా డబ్బింగ్‌ చెప్పాలనుకున్నారట. నా గొంతు విన్నాక, నాతో డబ్బింగ్‌ చెప్పించారు. ‘రంగస్థలం’లో కొన్ని సీన్లలో సమంత పక్కనే ఉండి చెప్పించుకున్నారు. ఆవిడ అందులో చాలా బాగా చేసారు. ఆవిడ క్యారెక్టర్‌కి ఏ మాత్రం ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్తగా డబ్బింగ్‌ చెప్పాను.

ఎన్నో పాత్రలు చేస్తాం...
డబ్బింగ్‌లో ఒక సౌలభ్యం ఉంటుంది. మేం ఎన్నో వైవిధ్యమున్న పాత్రలకు డబ్బింగ్‌ చెబుతాం. బబ్లీ, ప్రాస్టిట్యూట్, జమీందారు... రకరకాల పాత్రలు. అదే నటనలో అయితే ఇన్ని పాత్రలు చేయలేం కదా. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నా కెరీర్‌ ప్రారంభించాక ఇంతవరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు రెండు చిన్న సినిమాలకు డబ్బింగ్‌ చెబుతున్నాను.
– సంభాషణ: వైజయంతి

డబ్బింగ్‌ చెప్పిన చిత్రాలు
రంగస్థలం- సమంత
కంచె-  ప్రజ్ఞా జైస్వాల్‌
వేదం- అనుష్క
రారండోయ్‌ వేడుక చూద్దాం- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
జేమ్స్‌బాండ్‌- సాక్షి చౌదరి
నాయకి- త్రిష    
రెబల్‌- దీక్షా సేథ్,
రాజుగారి గది–2- సీరత్‌ కపూర్, అభినయ..
ఇంకా కొన్ని చిత్రాలు
(వేదం చిత్రానికి సూపర్‌ హిట్‌ మూవీస్‌ అవార్డు)

డైలాగులు...
రంగస్థలం- ‘‘ఆ పేమంటే ఇంతే మరి ఇలాగే సెప్తారు. నీకినపడదని ఓ అరిసి సెప్పరు’’
వేదం- ‘‘అవున్సారు డబ్బులకమ్ముడుపోతాం. ఎందుకంటే మాకు సదువు రాదు ఉద్దోగం లేదు, మరి మీకేమైందయ్యా’’
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌- ‘‘ప్రతి రూపాయికి కౌంట్‌ ఇక్కడ’’
రారండోయ్‌ వేడుక చూద్దాం- ‘‘భ్రమరాంబకు కోపమొస్తుంది ; భ్రమరాంబకి అది నచ్చలేదు ; ఇప్పుడు భ్రమరాంబకి కోపం వచ్చింది’’
కంచె- ‘‘ఓయ్‌ షేక్‌స్పియర్‌! ఏంటోయ్‌! మా అన్నయ్యను కాదని నా దగ్గరకు వద్దామనుకుంటున్నావా’’

డబ్బింగ్‌చెప్పిన సీరియల్స్‌
► ఆడదే ఆధారం
► తూర్పు వెళ్లేరైలు ∙
► దేవత
► కొత్తబంగారం
► కల్యాణ తిలకం
► పసుపు కుంకుమ. (2011లో పసుపు కుంకుమ సీరియల్‌కి నంది అవార్డు)

మరిన్ని వార్తలు