ఔరా.. ఏమి నటన!

24 Jul, 2018 12:03 IST|Sakshi
యమధర్మరాజు పాత్రలో రోహన్‌ రాయ్‌ , కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా.. జగపతిబాబుతో..

ఏడేళ్ల వయసు నుంచే బుల్లి తెరపై మెరుపులు  

ఆ తర్వాత వెండి తెరపై అసమాన వెలుగులు

డైలాగ్‌ డెలివరీలో తనదైన అద్భుత ముద్ర

అబ్బురపరుస్తున్న బాలనటుడు రోహన్‌ రాయ్‌   

డైనమెట్‌ ఆఫ్‌ జూనియర్‌ అవార్డు కైవసం

పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడిని తలపిస్తున్నాడు ఆ బాలుడు. ఇటు బుల్లి తెరపై.. అటు వెండి తెరపై అసమాన నటనా చాతుర్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఏడేళ్ల ప్రాయంలోనే టీవీ సీరియల్స్‌లో అరంగ్రేటం చేసిన రోహన్‌ రాయ్‌తనదైన ప్రతిభతోదూసుకెళ్తున్నాడు. డైలాగ్‌లను అలవోకగా చెబుతూ తనకు తానే సాటిఅని నిరూపిస్తున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌ : గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో నివసిస్తున్న చిన్న సుబ్బారాయుడు, రాధా మాధవి దంపతుల కుమారుడు రోహన్‌ రాయ్‌. స్థానికంగా ఉన్న కేంద్రీయ విద్యాలయలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అచ్చంగా వారి గొంతును అనుకరించి మాట్లాడేవాడు. సినీనటుడు రజనీకాంత్‌ డైలాగ్‌లను చెబుతుండేవాడు. గోన గన్నారెడ్డి సినిమా డైలాగ్‌లు అలవోకగా చెప్పేవాడు. కుమారుడి ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు 2016లో జీ తెలుగు సీజన్‌ –1 డ్రామా జూనియర్స్‌కు దరఖాస్తు చేశారు. ఆ పోటీలతో బుల్లితెరపై రోహన్‌ రాయ్‌ కేరీర్‌ మొదలైంది. అప్పటి నుంచి టీవీ సీరియల్స్, సినిమాలో రోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

టీవీ సీరియళ్లలో..   
మా టీవీ సీరియల్‌ ‘కథలో రాజకుమారీ’లో అభి పాత్రలో హీరో అన్న కొడుకుగా నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే గుండమ్మ కథ సీరియల్‌లో గుండమ్మ మేనల్లుడుగా నటిస్తున్నాడు. నెలలో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.  ఈ టీవీలో అభిరుచి అనే చెఫ్‌ ప్రోగ్రాంలో రోహన్‌  యాంకర్‌గా 40 ఎపిసోడ్‌లు చేశాడు. జీ తెలుగులో కామెడీ షో, బోనాలు, హోలీ, ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నాడు. అంతే కాకుండా గోల్డెన్‌ అవార్డ్స్, అప్సర అవార్డు ఫంక్షన్లలో పాల్గొన్నాడు.


అవార్డుకు ఎంపికయ్యింది ఇలా..
జీ తెలుగులో డ్రామా జూనియర్‌ పోటీల్లో భాగంగా 2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 3000 మంది చిన్నారుల్లో 25 మందిని ఎంపిక చేశారు. వీరిలో రోహన్‌ 6వ స్థానంలో నిలిచాడు. జూనియర్‌ డ్రామా పోటీల్లో గోన గన్నారెడ్డి, రజనీకాంత్, రాంగోల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్‌ నటనలను నాటిక రూపంలో ప్రదర్శించాడు. యమధర్మరాజు పాత్రతో ఆకట్టుకున్నాడు. ఫైనల్‌ పోటీలలో అమ్మాయి గెటప్‌లో అమెరికా కోడలుగా నటించాడు. డైనమెట్‌ ఆఫ్‌ డ్రామా జూనియర్స్‌– 2017అవార్డ్‌ అందుకున్నారు. అంతే కాకుండా తత్వపీఠం ఉగాది పుస్కారాన్ని రోహన్‌కు అందించింది.

సినిమా అవకాశాలు..   
2017లో రాజుగారి గది– 2లో హీరోయిన్‌ సమంత ట్యూషన్‌ స్టూడెంట్‌గా రోహన్‌ కనిపిస్తాడు.  ఈ సినిమాతో రోహన్‌ కేరీర్‌ ప్రారంభమైంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రంగుల రాట్నం సినిమాలో రోహన్‌ బర్త్‌ డే ఈవెంట్‌కు మేనేజర్‌గా హీరోయిన్‌ చిత్ర శుక్లా వ్యవహరిస్తుంది. ఈ సన్నివేశంలో బాలనటుడు రోహన్‌ హీరోయిన్‌ను ఏడ్పిస్తాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమాలో హీరో రామ్‌చరణ్‌  చిన్ననాటి పాత్రలో రోహన్‌ రాయ్‌ నటిస్తున్నాడు. మా ఊరిలో మా ప్రేమ కథ చిత్రం హీరో విజయ్‌ చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గుంటూరు టాకీస్‌– 2లో నటుడు నరేష్‌ కొడుకుగా నటిస్తున్నాడు. 

హీరో కావాలనుంది..  
పెద్దయ్యాక సినిమాల్లో హీరోగా నటించాలని ఉంది. నటనలో మంచి పేరు తెచ్చుకోవాలనుంది. అమ్మా నాన్న నన్నెంతగానే ప్రోత్సస్తున్నారు. హీరో అల్లు అర్జున్‌ ఎంతో ఇష్టం. అతను స్టైలిష్‌గా ఉంటాడు. డ్యాన్స్‌ బాగా చేస్తాడు.
– రోహన్‌ రాయ్‌

మరిన్ని వార్తలు