మంచి జరుగుతుంది.. విజయం దక్కుతుంది

7 May, 2019 00:26 IST|Sakshi
సాషా, విజయ్‌ రాజా, పూజ, అచ్చిరెడ్డి, శ్రీకాంత్, శివాజీరాజా

‘‘విజయ్‌ రాజాను చూస్తుంటే ‘బొబ్బిలిరాజా’లో శివాజీరాజా గుర్తొస్తున్నాడు. ఇటీవల వచ్చిన ‘నేనేరాజు నేనే మంత్రి’తో సహా మా కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం హిట్‌ అయింది. ‘ఏదైనా జరగొచ్చు’ అని టైటిల్‌ పెట్టారు.. మంచే జరుగుతుంది, హిట్టే వస్తుంది’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా కె.రమాకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్‌ కథానాయికలుగా కె. ఉమాకాంత్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శివాజీరాజా కూడా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు.. హీరోగా చేశాడు. మంచి నటుడిగా, మానవతావాదిగా పేరు సంపాదించాడు. వాళ్లబ్బాయి భవిష్యత్తు బాగుండాలి’’ అన్నారు. ‘‘పదేళ్లక్రితం మా సినిమా ‘విరోధి’లో విజయ్‌ నటించాడు. అప్పుడే ఇంత పెద్దోడు అయ్యాడా అనిపిస్తోంది’’ అన్నారు నటుడు శ్రీకాంత్‌. ‘‘విజయానికి కావాల్సిన అంశాలన్నీ ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘విజయ్‌ దేవరకొండ అంతటి సక్సెస్‌ను విజయ్‌ రాజా అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి.

‘‘నాకు కావాల్సిన వాళ్లంతా ఈ వేడుకకు రావడం హ్యాపీగా ఉంది. వీళ్లందరి ప్రేమాభిమానాలు, సపోర్ట్‌తోనే 450 సినిమాలు చేశా. అదే ప్రేమను నా కొడుకుపై చూపిస్తూ ఆశీర్వదించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివాజీరాజా.  ‘‘హాలీవుడ్‌లో నా ఫేవరెట్‌ డైరెక్టర్‌ క్వెంటిన్‌ టొరంటినో. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్‌ చూశాక రమాకాంత్‌లోనూ ఆయన శైలి కనిపించింది’’ అని హీరో తరుణ్‌ అన్నారు.  ‘‘శని, ఆదివారాలు శ్రీకాంత్‌గారి ఇంటికెళ్తే.. ఎంత హార్డ్‌ వర్క్‌ చేస్తే అంతపైకి వస్తారని రోషన్‌కు, నాకు చెప్పి ప్రోత్సహించేవారు’’ అన్నారు విజయ్‌ రాజా. ‘‘ఇదొక కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా. థ్రిల్లర్‌ అండ్‌ హారర్‌ కామెడీ ఉంటుంది’’ అన్నారు రమాకాంత్‌. నిర్మాత సి. కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు