‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

23 Aug, 2019 12:37 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : ఏదైనా జరగొచ్చు
జానర్‌ : డార్క్‌ కామెడీ హారర్‌
నటీనటులు : విజయ్‌ రాజా, బాబీ సింహా, పూజా సోలంకి, సాషా సింగ్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : శ్రీకాంత్‌ పెండ్యాల
నిర్మాత : సుదర్శన్‌ హనగోడు
దర్శకత్వం : రమాకాంత్‌

టాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన సీనియర్‌ నటుడు శివాజీ రాజా తనయుడు.. విజయ్‌ రాజాను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఏదైనా జరగొచ్చు. తమిళ నటుడు బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా రమాకాంత్‌, సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ పెండ్యాలలు పరిచయం అయ్యారు. మరి వీరందరికీ ఈ సినిమా బ్రేక్‌ ఇచ్చిందా..?

కథ :
జై (విజయ్‌ రాజా) తన స్నేహితులతో కలిసి ఈజీగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్ చేస్తుంటాడు. ఓ ప్రైవేట్‌ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరిన జైకి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే శశితో ప్రేమలో పడ్డ జై, ఆమె ఇబ్బందుల గురించి తెలుసుకొని ఎలాగైన సాయం చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాళీ(బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం జై అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? అన్నదే మిగతా కథ.

నటీనటులు:
ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్‌ రాజా పరవాలేదనిపించాడు. కామెడీ, లవ్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. కాళీ పాత్రకు బాబీ సింహా సరిగ్గా సరిపోయాడు. సీరియస్‌ లుక్‌లో మంచి విలనిజం చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. బేబీ పాత్రలో నటించిన సాషా సింగ్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. హీరోయిన్‌గా పూజా సోలంకి లుక్స్‌ పరంగా ఆకట్టుకున్నా నటనతో మెప్పించలేకపోయింది. సెకండ్‌ హాఫ్‌లో వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
సూపర్‌ నేచురల్‌ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ స్థాయిలో సినిమాను తెరకెక్కించటంలో తడబడ్డాడు. ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్‌ సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. హీరో, అతని ఫ్రెండ్స్‌ డబ్బు కోసం చేసే ప్రయత్నాలు, లవ్‌ ట్రాక్‌ అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసినా, ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. అసలు ట్విస్ట్ రివీల్‌ అయిన తరువాత కూడా కథనం నెమ్మదిగా సాగుతూ విసిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వెన్నెల కిశోర్‌ కామెడీ బాగానే వర్క్‌ అవుట్ అయ్యింది. హారర్‌ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ తొలి ప్రయత్నంలో శ్రీకాంత్ పెండ్యాల తన మార్క్‌ చూపించలేకపోయాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్‌ :
బాబీ సింహా
వెన్నెల కిశోర్‌ కామెడీ

మైనస్‌ పాయింట్స్‌ :
కథా కథనం
సంగీతం
లాజిక్‌ లేని సన్నివేశాలు

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Rating:  
(1.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు