ఈ 'నలుగురు'

10 Jul, 2018 08:01 IST|Sakshi

శ్రీనగర్‌కాలనీ: ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. సినిమా ఇలా కూడా తీయొచ్చని నిరూపించింది. నలుగురు స్నేహితుల జర్నీని చాలా సహజంగా తెరకెక్కించారు దర్శకుడు తరుణ్‌భాస్కర్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సంపాదించింది. ప్రధాన పాత్రల్లో నటించిన నలుగురిలో... ముగ్గురు పక్కా హైదరాబాదీలు. ఇక్కడే పుట్టి పెరిగారు. మరొకరు గుంటూరు అబ్బాయ్‌. వీరిలో ఇద్దరు జాబ్‌ వదిలేసి, మరో ఇద్దరు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చారు. ఈ నలుగురిని ‘సాక్షి’ పలకరించగా ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విశేషాలివీ...

బిర్యానీ ఇష్టం...
నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నా అసలు పేరు దినేష్‌నాయుడు. స్క్రీన్‌ నేమ్‌ విశ్వక్సేన్‌ నాయుడు. ముచ్చటగా మూడో పేరు ఈ చ్రితంలో వివేక్‌. జర్నలిజం డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశాను. ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నగర సంస్కృతి సంప్రదాయాలపై మంచి అవగాహన ఉంది. హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నటుడు కావాలని ఉండేది. నటన, డ్యాన్స్‌ మీద ఆసక్తితో డ్యాన్స్‌ స్కూల్‌ నడిపాను. ఆ తర్వాత థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాను. నటన మీద పట్టు వచ్చాక ‘వెళ్లిపోయాకే’ అనే చిత్రంలో హీరోగా చేశాను. అనంతరం ఓ మళయాల చిత్రం హక్కులు కొని నా స్వీయ దర్శకత్వంలో సినిమా తీద్దామనుకునే సమయంలో తరుణ్‌భాస్కర్‌ నుంచి పిలుపొచ్చింది. ఆడిషన్‌కు వెళ్లి సెలెక్ట్‌ అయ్యాను. చిత్రంలో లీడ్‌ రోల్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొత్త సినిమా అవకాశాలు వస్తున్నాయి.
(విశ్వక్సేన్‌ నాయుడు– చిత్రంలో వివేక్‌) 


డైరెక్షన్‌ టు యాక్షన్‌
మాది గుంటూరు. నగరంలోని మాసబ్‌ట్యాంక్‌లో ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. ఫ్రెండ్‌ ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని కలిసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. చిత్రంలో ఓ పాత్ర కోసం మేము ఆడిషన్‌ నిర్వహించాం. అయితే ఎవరూ సెట్‌ కాకపోవడంతో, నా బిహేవియర్‌ చూసి తరుణ్‌భాస్కర్‌ ఆడిషన్‌ ఇవ్వమన్నారు. నాకు నటించడం చేతకాదని చెప్పాను. అయినా ఆడిషన్‌ ఇవ్వమన్నారు. రూమ్‌లో ప్రిపేర్‌ అయ్యి ఆడిషన్‌ ఇచ్చాను. తరుణ్‌భాస్కర్‌కి నచ్చడంతో చిత్రంలో ఉపేంద్ర పాత్ర ఇచ్చారు. చిత్రంలో ఉప్పు పాత్రకు మంచి స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. స్పైసీ ఫుడ్‌ ఇష్టం. నాకు రాయడం చాలా ఇష్టం. మంచి రచయితగా, నటుడిగా ఇండస్ట్రీలో ఉండాలన్నదే నా ఆశయం.
(వెంకటేష్‌ కుకుమాను – చిత్రంలో ఉపేంద్ర)

 

ఐ లైక్‌ లాంగ్‌డ్రైవ్‌...
నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే ఇంటర్‌ వరకు చదివాను. తర్వాత యూఎస్‌లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాను. నగరానికి తిరిగొచ్చి, ఒక నెల రీసెర్చ్‌ అనలిస్ట్‌గా జాబ్‌ చేశాను. ఫ్రెండ్‌ ద్వారా దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ని కలిశాను. పెళ్లిచూపుల తర్వాత మరో సినిమా తీసేందుకు వాళ్లు అప్పుడే ప్లాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఆడిషన్‌కి వెళ్లి సెలెక్ట్‌ అయ్యాను. సినిమాలో మంచి పాత్ర చేసినందుకు, ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌ బిర్యానీ చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో లాంగ్‌డ్రైవ్స్‌కి వెళ్తుంటాను. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది.
(సాయి సుశాంత్‌రెడ్డి  – చిత్రంలో కార్తీక్‌)

నాంపల్లి నా అడ్డా...
నాంపల్లి నా అడ్డా... విజ్ఞాన్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశాను. ఆ తర్వాత డెల్‌ కంపెనీలో రీసెర్చ్‌ అనలిస్ట్‌గా జాబ్‌ చేశాను. కానీ నాకు జాబ్‌ సెట్‌ అవ్వదని అనిపించింది. థియేటర్‌కి వెళ్లాను. అక్కడే నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. ఐదు షార్ట్‌ఫిలిమ్స్‌ కూడా చేశాను. సోషల్‌ మీడియాలో నా నటన చూసి ‘జగన్నాటకం’ అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీరావా’లో మంచి పాత్ర చేశాను. ఆడిషన్స్‌కు వెళ్లి తరుణ్‌భాస్కర్‌ చిత్రానికి ఎంపికయ్యాను. డిఫరెంట్‌ పాత్రలు చేయాలన్నదే నా ఆశ. దర్శకుడు తేజ, ఆది సాయికిరణ్‌ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. 
(అభినవ్‌ గోమటం – చిత్రంలో కౌషిక్‌)

మరిన్ని వార్తలు