తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు

28 Jul, 2014 11:10 IST|Sakshi
తమిళ దృశ్యానికి సినిమా కష్టాలు

మళయాళం, కన్నడం, తెలుగు భాషల్లో భారీగా హిట్టయిన చిన్న సినిమా 'దృశ్యం' ఇప్పుడు సరికొత్త చిక్కులు ఎదుర్కొంటోంది. ఈ సినిమాను తమిళంలో తీయాలని సుప్రసిద్ధ నటుడు కమల్హాసన్ భావించారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావించారు. 'ఎర్ర గులాబీలు', 'వసంత కోకిల' లాంటి చిత్రాల్లో హిట్ పెయిర్గా నటించిన కమల్హాసన్, శ్రీదేవి ఈ సినిమాలో కూడా ఉంటున్నారు.

కానీ శ్రీదేవి మాత్రం ఈ చిత్రంలో కమల్ సరసన హీరోయిన్గా కాకుండా.. తెలుగులో నదియా పోషించిన పోలీసు ఆఫీసర్ పాత్ర పోషించబోతోందని సమాచారం. మలయాళం సినిమాకి దర్శకత్వం వహించన జీతూ జోసెఫ్ ఈ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు శ్రీ ప్రియ దర్శకత్వం వహించారు.అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇతర టెక్నీషియన్లు, తారాగణం ఎంపిక జరగవలసి ఉంది. ఈ సినిమాను రాజ్ కుమార్ థియటర్స్ మరియు  వైడ్ యాంగిల్ క్రియేషన్స్ వారు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి  సంగీతం ఘిబ్రన్ అందిస్తున్నారు.

అయితే, మళయాళంలో తీసిన మాతృక గురించి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కోర్టుకెక్కింది. తాను కొన్న జపాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇందులో కాపీ చేశారంటూ మళయాళ చిత్ర రచయిత, నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. ఈ వివాదం సమసిపోకుండానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ కథ తనదని, తాను రాసిన 'ఒరు మజకళాటు' నవలను కాపీ చేశారని ఆరోపిస్తూ.. మలయాళ రచయిత సతీష్‌ పాల్‌ కోర్టుకి ఎక్కాడు. దీంతో ఈ సినిమా తమిళ వెర్షన్‌ షూటింగ్‌ నిలుపుదల చేయాలంటూ ఎర్నాకుళం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.