అప్పుడు మగధీర.. ఇప్పుడు ఎవడు

17 Jul, 2013 01:03 IST|Sakshi
అప్పుడు మగధీర.. ఇప్పుడు ఎవడు

ఎవడు?... తెరపై ప్రతినాయకులకే కాదు... తెర ముందు కూర్చున్న ప్రేక్షకులకూ ఇదే ప్రశ్న. ఇంతకీ ఈ ‘ఎవడు’ రామ్‌చరణా? అల్లు అర్జునా?. లేక ఇద్దరూ కలిసి ప్రతి నాయకుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారా? అసలు ఈ ఇద్దరూ ఒకరేనా? ‘ఎవడు’ కథ, కథనాలు అలాగే ఉంటాయట. అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రాన్ని తిలకించిన మెగాస్టార్ చిరంజీవి.. ‘మగధీర’ రికార్డులకు చెక్ పెట్టే సినిమా ఇదని జోస్యం చెప్పేశారు. అంటే వంశీ ఈ సినిమాను ఏ రేంజ్‌లో తీసుంటారో అర్థం చేసుకోవచ్చు. దిల్ రాజు నిర్మించిన చిత్రాల్లో ఇదే హై బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది.
 
 దిల్‌రాజు మాట్లాడుతూ-‘‘ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కథ, కథానాలుంటాయి. రామ్‌చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందని మా నమ్మకం. జూలై మెగా ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన నెల. చిరంజీవిగారి ‘ఇంద్ర’, పవన్‌కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’, రామ్‌చరణ్ ‘మగధీర’ చిత్రాలు ఇదే నెలలో విడుదలై సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా ‘మగధీర’ రిలీజైన జూలై 31నే ‘ఎవడు’ కూడా వస్తోంది. ఆ ఫీట్‌ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందని నా నమ్మకం. శ్రుతి హాసన్, అమీ జాక్సన్ అందాలు, దేవిశ్రీప్రసాద్ మెస్మరైజింగ్ మ్యూజిక్.. వీటన్నింటినీ మించి వంశీ మేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలువనున్నాయి. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని తెలిపారు.