హాయ్.. హాయ్!

21 Jan, 2014 04:13 IST|Sakshi
హాయ్.. హాయ్!
హాయ్..హాయ్! ఏంటనుకుంటున్నారా? ఈ పలకరింపులు ఒకనాటి గాఢ ప్రేమికులు, ఆ తరువాత మాజీ ప్రేమికులు, తాజా సంచలన జంట అయిన శింబు, నయనతారలవి. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఏ నోట విన్నా ఈ జంట ఊసులే. వల్లవన్ చిత్రం నిర్మాణం సమయంలో శింబు, నయనతార మధ్య ప్రేమాయణం ఘాటుగా సాగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రేమ తరువాత ద్వేషంగా మారింది. ఆ తరువాత నయనతార ప్రభుదేవాతో రొమాన్స్ చేసింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందనుకున్నారు. చివరికి అది పెటాకులయ్యింది. దీంతో మళ్లీ నటనపై దృష్టి సారించిన నయన ఇటీవల అందరూ విస్మయం చెందే నిర్ణయం తీసుకుంది. అదే మాజీ ప్రియుడు శింబుతో మళ్లీ జత కట్టడానికి అంగీకరించడం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది.
 
తొలుత రెండు రోజుల్లో నయనతారకు చెందిన సన్నివేశాలనే చిత్రీకరించారు. ఆ తరువాత హీరో ఎంటర్ అయ్యారు. శింబు, నయనతారల సన్నివేశాల చిత్రీకరణ రోజు యూనిట్ అంతా ఒక విధమైన ఉద్వేగానికి గురైందట. ఒకనాటి ప్రేమికులు, మళ్లీ కలుసుకునే తరుణం ఎలా ఉంటుందన్నదే వారి టెన్షన్‌కు కారణం. అయితే సెట్‌లోకి అడుగుపెట్టిన శింబు, నయనతారలు చాలా కూల్‌గా హాయ్ హాయ్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకోవడంతో యూనిట్ వర్గాల ముఖాల్లో టెన్షన్ పోయి ఆశ్చర్యం చోటు చేసుకుందట. అంతేకాదు షూటింగ్ గ్యాప్‌లో నయన, శింబులు ఏకాంతంగా గంటల తరబడి మాట్లాడుకోవడం యూనిట్ వాళ్లు మరింత షాక్‌కు గురయ్యారట. ఇలాంటి షాక్‌ల మీద షాక్ లివ్వడం వీరిద్దరికీ మామూలేనంటూ కోలీవుడ్ గుసగుసలాడుతోంది. ఈ సంచలన జంట మధ్య మళ్లీ ప్రేమ మొదలైనా ఆశ్చర్యపడనక్కరలేదనే టాక్ వినిపిస్తోంది. 
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి