ఎక్కువైన యూట్యూబ్ చానళ్లు

4 Jul, 2016 03:04 IST|Sakshi
ఎక్కువైన యూట్యూబ్ చానళ్లు

సినిమా సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే టెక్నాలజీని ఉపయోగించుకుని యూట్యూబ్ చానళ్లు అధికం అవుతున్నాయన్నది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా యూట్యూబ్ చానళ్లలో చిత్రాలను చూడడానికి యువత ఆసక్తి చూపడం ఇందుకు ఒక కారణం కావచ్చు. ప్రముఖ సంస్థలు యూట్యూబ్ చానళ్లను ప్రారంభించడానికి ముందుకొస్తున్నారు. ఇండియాలో ప్రముఖ యూట్యూబ్ చానల్ సంస్థ కల్చర్ మిషన్ తన చానల్ ప్రచారాలను విస్తరించుకుంటూ పోతోంది.

ఇప్పటికే తమిళంలో పుట్‌చుట్నీ చానల్‌ను ప్రారంభించి ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ తెలుగులోనూ వైవా పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఈ చానల్ ద్వారా తొలిసారిగా ఎవ్విరి హైదరాబాదీ పేరుతో చిత్రాన్ని రూపొందించి ప్రచారం చేస్తోంది. దీని గురించి ఆ చానల్  కోఫౌండర్, సీఈఓ సమీర్ పిటల్‌వాలా తెలుపుతూ ఎవ్విరి హైదరాబాదీ యూట్యూబ్ చిత్రం ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాలను యదార్థంగా ఆవిష్కరిస్తుందన్నారు. ముఖ్యంగా అక్కడి యువత పోకడలను, వారి జీవన విధానాన్ని తెలిపే చిత్రంగా ఉంటుందని తెలిపారు.