నమ్మితే ఉన్నాడు

16 Jan, 2018 23:16 IST|Sakshi

కష్టం వచ్చినప్పుడు నమ్మితే? ... కోరిక కలిగినప్పుడు నమ్మితే? ఎవర్నయినా కాపాడాలి అని నమ్మితే? ... నలుగురు బాగుండాలి అని నమ్మితే? ఉన్నప్పుడు ఇవ్వాలి అని నమ్మితే?... లేనప్పుడు ఉన్నాడని నమ్మితే? నమ్మితే... దేవుడున్నాడు... అంటున్నారు నటి సీత.

హావభావాలు శక్తిమంతంగా ప్రదర్శించే నటి సీత. ‘చిన్నారి స్నేహం’, ‘పోలీసు భార్య’, ‘ఆడదే ఆధారం’, ‘ముత్యమంత ముద్దు’ వంటి పెద్ద హిట్స్‌ ఆమె జాబితాలో ఉన్నాయి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘సింహాద్రి’, ‘బన్ని’, ‘కరెంటు తీగ’ వంటి సినిమాలలో నటించారు.  ‘నేను–నా దైవం’ గురించి ఆమె సాక్షితో కొన్ని ఆలోచనలు పంచుకున్నారు.

జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్టున్నారు?
అవును. జీవితం అంటే అదే. సాఫీగా ఉండేది జీవితం కాదు. మనం ఊహించినట్టుగా ఉండేది కూడా జీవితం కాదు. జీవితం సముద్రంలాంటిది. దాని వీపు మీద మనం ప్రయాణం చేస్తుంటాం కాని అది ఏ క్షణం ఎలా మారుతుందో ఊహించలేము.

పురుషుల కంటే స్త్రీలకు ఈ విషయంలో ఎక్కువ దైవ ఆలంబన అవసరమా?
దైవ ఆలంబన విషయంలో స్త్రీలకు, పురుషులకు తేడా ఉండదు. కాని గమనించి చూస్తే స్త్రీలు కాసేపు దేవుని దగ్గర తమ మనసులో ఉన్నదంతా గుమ్మరించుకుని తేలిక పడతారు. కాని మగవాళ్లు దేవుణ్ణి పట్టుకుంటే అలాగే పట్టుకునే ఉండాలి. స్త్రీలకు కుటుంబం ఉంటుంది. ఇంటిని చక్కదిద్దుకోవడమే వాళ్లకు అసలైన పుణ్యకార్యం. అందుకే పురాణాల్లో సతీ అనసూయ వంటి పతివ్రతలు ఎక్కువ కనిపిస్తారు. పురుషులలో భక్త సిరియాళ, భక్త మార్కండేయ, భక్త ప్రహ్లాద వంటి వీర భక్తులు ఎక్కువ కనిపిస్తారు.

మీ మీద భక్తి ప్రభావం ఎలా ఉండేది?
చాలా ఎక్కువ ఉండేది. మా ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మ ప్రత్యేక పూజలు చేసేది. పూజకు ఉపయోగించే సామగ్రిని శుభ్రం చేసే పని నేనే చేసేదాన్ని.  ఆరేళ్ల వయసు నుంచి అనుకుంటా నేనే దేవుడి సామాన్లన్నీ తళతళ మెరిసేలా శుభ్రం చేసి పెట్టేదాన్ని. బిడ్డకు జలుబు చేస్తుంది అని తాత వారించినా ఒప్పుకునేదాన్ని కాను. దేవుళ్ల బొమ్మలు, పటాలు కూడా శుభ్రం చేసి పూజకు సిద్ధం చేసేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక  కేసరి, పొంగల్, వడ ప్రసాదాలను  రుచిగా వండేదాన్ని. ప్రతి ఉదయం పూజ, ప్రసాదాల అలవాటు నా జీవితంలో పాజిటివ్‌ ఎనర్జీని పెంచేది.

ఈ దేవుళ్లు హిందువుల దేవుళ్లు వీళ్లనే పూజించాలి అని అనుకునేవారా?
అలా ఏం లేదు. ఏ ఇంట్లో అయినా మన సంప్రదాయాన్నే మన పెద్దవాళ్లు నేర్పిస్తారు. దాంతో పాటు పొరుగు సంప్రదాయాన్ని కూడా గౌరవించే సహనం, ప్రేమ మన సంస్కృతిలో ఉన్నాయి. మన బాల్యమంతా అలాంటి సంస్కృతిలోనే గడిచిందని మనమంతా గుర్తు చేసుకుంటే ఈ సమాజం ఎంతో బాగుండనిపిస్తుంది. చిన్నప్పుడు కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుకునేటప్పుడు చర్చికి తరచూ వెళ్లేదాన్ని. క్రీస్తు ప్రార్థనలు భక్తిగా చేసేదాన్ని. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు ఇప్పుడూ తరచూ వెళుతుంటాను. పుదుప్పేటలో మా ఇంటికీ సమీపంలోని దర్గాలో తెల్లవారుజాము 5 గంటలకు ప్రార్థ్దనలు జరిపేవారు. అలారంతో పని లేకుండా ఆ టైమ్‌కి నిద్రలేచి పూజలు చేసుకునేదాన్ని. అలా ఆ దర్గా నాలో ఒక సమయపాలనను నేర్పింది. ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లోవాళ్లు దర్గాకు తీసుకువెళ్లి మంత్రం వేయించేవారు, తాయెత్తులు కట్టించేవారు. జబ్బు నయం అయ్యేది.

ఏ దేవుడంటే ఇష్టం ఉండేది?
మా ఇష్ట దైవం వేంకటేశ్వర స్వామి. ఇంట్లో ఆయనకే ఎక్కువగా పూజలు జరిపేవారు. నా చిన్నతనంలో తరచూ తిరుమల వెళ్లేవాళ్లం. అలా వెళ్లేముందు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి ‘గోవిందా’ అంటూ ముడుపులు, విరాళాలు సేకరించి అలా సేకరించిన సొమ్మును తిరుమలలో స్వామివారి సన్నిధిలోని హుండీలో వేసేవాళ్లం. ఇందుకోసమని  నేను, అన్నయ్య, తమ్ముడు కలిసి ఇంటింటికి తిరిగేవాళ్లం. వాళ్లు కాస్త సిగ్గుపడుతుంటే ‘గోవిందా....గో....విందా’ అని నేను మాత్రమే బిగ్గరగా అరిచేదాన్ని (చిన్న నవ్వు).

అసలు దైవానికి ఎలా కనెక్ట్‌ అవ్వాలి?
నేనైతే ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు ముగించుకొని పూజ చేసుకుంటాను. తరువాత 20 నిమిషాలైనా ధ్యానం చేస్తాను. శరీరం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు మనసు కూడా శుభ్రంగా ఉంటేనే  అక్కడ  దేవుడు ఉంటాడు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడు దేవుడు ఉన్నాడనే భావన కలుగుతుంది. దేవుడంటే ఎక్కడో కాదని, మనలోనే ఉన్నాడని, దేహమే దేవాలయం అనే భావన ఉండాలి. అప్పుడే కనెక్ట్‌ అవుతాం.

ఇది దైవ మహిమా అని ఎప్పుడైనా అనిపించిందా?
 ఒకసారి ఫుడ్‌ అలర్జీ వచ్చి ముఖమంతా ర్యాష్‌ వచ్చింది. డాక్టర్‌ వద్దకు వెళితే మందులిచ్చి పది రోజులపాటు మేకప్‌ వేసుకోవద్దని చెప్పారు. నాకేమో రోజూ షూటింగ్‌ ఉంది. నేను వెళ్లకుండా సహ  నటుల కాంబినేషన్‌ మిస్సయితే నిర్మాతకు నష్టం వస్తుంది. దేవుడిని ప్రార్థిస్తూనే షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లాను. చిత్ర దర్శకులు నా వద్దకు వచ్చి ఈ క్యారెక్టర్‌కు బొత్తిగా మేకప్‌ అవసరం లేదని చెప్పారు. నాకైతే అప్పుడు నోటమాటరాలేదు. అద్భుతం అనిపించింది. అలాగే మరొకటి. నాకు షిరిడీ సాయిబాబా అన్నా  చాలా భక్తి. షిరిడీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌తో  వచ్చేటప్పుడు నా కోసం బాబా విగ్రహం తీసుకురావాలని చెప్పాను. అయితే వాళ్లు మర్చిపోయి వచ్చారు. అదే రోజున ఒక షాప్‌ ఓపెనింగ్‌కు వెళుతూ బాబా విగ్రహం రాలేదే అని తలచుకుంటూ వెళ్లాను. నన్ను ముఖ్యఅతిధిగా పిలిచిన నిర్వాహకులు నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అలాంటి షిరిడీ బాబా విగ్రహాన్ని బహూకరించారు. ఆరోజు నా సంతోషానికి అవధులు లేవు. 

దేవుడిపై ఎపుడైనా కోపం వచ్చిందా?
తట్టుకోలేని చేదు అనుభవం ఎదురైనపుడు క్షణంపాటు కోపం కలుగుతుంది.  అయితే అంతలోనే ఆ కోపం మాయం అవుతుంది. ఏదో కారణం ఉంటేనే కానీ ఈ సంఘటన చోటు చేసుకోదు. దీని వెనుక దేవుడి మర్మం ఏదో ఉంది. అంతా మన మంచి కోసమేనని గట్టిగా అనుకుంటాను. కష్టాలు వచ్చినపుడు దేవుడా నాకెందుకీ ఆవేదనలు అంటారు. అదే కోటి రూపాయలు కలిసొస్తే దేవుడా నాకే ఎందుకిచ్చావు అని ఆలోచించరు. దైవం విషయంలో మనిషికి అలాంటి పరిణతి వస్తే ఎంతో బాగుంటుంది. 

దైవానికి నైవేద్యం పెట్టడం ఏంటని మీకెప్పుడైనా సందేహం కలిగిందా? 
దేవునికి నైవేద్యం పెట్టడం మంచిదే కాని అంతకంటే మనిషి ఆకలి తీర్చడం అవసరం. మీకు ఒక కథ చెబుతాను. కరువు పీడిస్తుండగా ఒక రైతు దేవుడికి పరీక్ష పెట్టాడు. నీవు నిజంగా ఉంటే నా అరటితోట విరగగాయాలి అన్నాట్ట. తోటకు చుక్కనీరు పోయకున్నా చక్కని పంట చేతికి రావడంతో దేవుడున్నాడని నమ్మాడు. వెంటనే గుడికి గంపలు గంపలు అరటి పళ్లను నైవేద్యానికి పంపాడు. అదే రోజు రాత్రి దేవుడు కలలోకి రాగా నేను పంపిన పండ్లు తిన్నావా అని అడిగాడు రైతు. ఒక్కటే తిన్నాను అని బదులిచ్చాడు దేవుడు. దాంతో రైతు తన పనివాళ్లు పండ్లు మొత్తం కాజేశారని తలచి వాళ్లను పిలిచి అసలేం జరిగిందని ప్రశ్నించాడు. అందరూ అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెట్టాం అని చెప్పారు. కాని ఒక్క పనివాడు మాత్రం వాటిని తీసుకెళ్లే దారిలో ఒక యాచకుడు ఆకలితో అలమటిస్తుంటే ఒక అరటిపండు ఇచ్చినట్టు చెప్పాడు. రైతుకు జ్ఞానోదయం అయింది– ఆకలితో ఉన్న వాడికి ఇచ్చిన ఆ ఒక్కపండే దేవుడికి చేరిందని.

ఇప్పుడు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారు?
నేను జీవించినంతకాలం అమ్మ నాతో ఉండాలి అని మొదటగా వేడుకుంటుంటాను. మనిషికి అషై్టశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం అనేది లేకుంటే అంతా వృథా. అందుకే నా ఫ్యామిలీనే కాదు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటాను. అలాగే, ప్రకృతి వైపరీత్యాలకు ప్రజలు గురికాకుండా కాపాడు స్వామి అని నమస్కరిస్తా. 2015 డిసెంబర్‌లో చెన్నైని వరదనీరు ముంచెత్తినపుడు ప్రజలు పడిన బాధలు చూసి ఎంతో చలించిపోయాను. అలాగే నటిగా వృత్తిపరంగా బాగా బిజీగా ఉండాలి అని కోరుకుంటాను. 

దైవంపై నమ్మకం అంటే ఎలా ఉండాలి ?
ఈ విషయంపై ఒక చిన్న కథ చెబుతాను. ఒక పేదవాడికి దేవుడు కలలో కనపడి ఫలానా చోట తవ్వితే నీకు నిధి దొరుకుతుంది, దరిద్రం తీరుతుందని చెప్పాడు. దానిని నమ్మి అతడు భూమి తవ్వుతుండగా సైనికులు వచ్చి ఇది రాజు గారి భూమి అని చెప్పి ఆ నేరానికి రాజు ముందు నిలబెట్టగా చెట్టుకు కట్టి కొరడా దెబ్బలు కొట్టమని రాజు శిక్ష వేశాడు. శిక్షను అమలుచేస్తున్న సైనికుడికి పేదవానిపై జాలి వేసి ‘అసలు గుంట ఎందుకు తవ్వుతున్నావు?’ అని ఆడిగారు. పేదవాడు విషయం చెప్పాడు. అది విని నవ్వుకున్న సైనికుడు నాకు కూడా నిన్న రాత్రి దేవుడు కలలో కనపడి నిన్ను కట్టేసిన చెట్టులో అపార నిధి ఉంది తీసుకో అన్నాడు, అలాగని చెట్టును తొలిచానా అని వెళ్లిపోయాడు. ఆ దేవుడు సైనికుని రూపంలో మరోసారి నాకు అవకాశం ఇచ్చాడని విశ్వసించిన పేదవాడు చెట్టులోని తొర్రను వెతగ్గా నిధి దొరికింది. దరిద్రం తీరింది. దేవుడిపై నమ్మకం అంటే సైనికుడిలా ఉండ కూడదు, పేదవాడిలా ఉండాలి.


– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!