చిరంజీవిగారు మా అమ్మకు పేరు పెట్టారు!

21 Aug, 2016 23:43 IST|Sakshi
చిరంజీవిగారు మా అమ్మకు పేరు పెట్టారు!

పాతికేళ్ల క్రితం వెండితెరపై సందడి చేసిన హిట్ పెయిర్స్‌లో చిరంజీవి-రాధల జంట ఒకటి. 1980 టు 1990 వరకూ చిరూ సరసన రాధ దాదాపు పదిహేను సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు బర్త్‌డే సందర్భంగా ‘సాక్షి’కి రాధ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
 
 చిరంజీవిగారిని మొదటిసారి మీరెప్పుడు కలిశారు?
 ‘గూండా’ సినిమాకి. ఆయన పక్కన నేను యాక్ట్ చేసిన మొదటి సినిమా అది. తెలుగు సినిమాలు చేయడం మొదలు పెట్టాక ఇక్కడి హీరోల డ్యాన్సులు చూసి ఆశ్చర్యపోయాను. చిరంజీవిగారి డ్యాన్స్ సూపర్.
 
 నటుడిగా ఆయన గురించి?
 డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుండే ది. ఎంత శ్రద్ధగా యాక్ట్ చేసేవా రంటే కెమేరా ముందుకెళ్లి పోయిన తర్వాత తాను చిరంజీవి అనే విషయాన్ని మర్చి పోయారేమో అనిపించేది. ఆయన తో డ్యాన్స్ అంటే ఇష్టంగా ఉండేది. పోటాపోటీగా చేయొచ్చు కదా.
 
 పోటీపడి డ్యాన్స్ చేయాలని ఆయనకు తెలియకుండా ముందుగా మీరు ప్రాక్టీస్ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా?
 అలా ఎప్పుడూ చేయలేదు. ఒకే ఒక్కసారి మాత్రం స్టెప్స్ ముందుగానే తెలుసుకున్నాను. ‘మరణ మృదంగం’లో ‘కొట్టండి తిట్టండి.. గిల్లండి.. గిచ్చండి...’ పాట ఉంది కదా. ఆ పాటని ఢిల్లీలో తీసినట్లు గుర్తు. అప్పుడు ఫ్లైట్‌లో నేను, తారా మాస్టర్ వెళ్లాం. ‘ఈవిడ ఈ పాటకి మనల్ని బాగా కష్టపెట్టడం ఖాయం’ అని ఫిక్సయ్యాను. ఎలాంటి స్టెప్స్ అనుకుంటున్నారో ముందే ఆవిడ చెప్పడంతో నాకో క్లారిటీ వచ్చేసింది. లొకేషన్లో నేను ఈజీగా చేసేశాను. అప్పుడు ‘నీకింత తొందరగా ఎలా వచ్చింది?’ అని చిరంజీవిగారు అడిగితే నవ్వాను.
 
 రాధికగారు, మీరు చిరంజీవిగారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆవిడతో మీకేమైనా పోటీ?
 అప్పట్లో మేం బాగా పోటీపడేవాళ్లం అనుకునేవాళ్లు. మా మధ్య మాత్రం పోటీ ఉండేది కాదు. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో చేసేదాన్ని. సంవత్సరానికి కనీసం పది సినిమాలకు పైగా చేతిలో ఉండేవి. దాంతో ఎవరి గురించీ ఆలోచించే తీరిక ఉండేది కాదు. పైగా నా స్టైల్ వేరు. రాధిక స్టైల్ వేరు.
 
 చిరంజీవిగారితో మీ కెమిస్ట్రీ బాగా కుదరడానికి కారణం?
 వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక కంఫర్ట్ లెవల్స్ పెరిగాయి. ఎన్టీఆర్‌గారు, కృష్ణగార్ల కాంబినేషన్‌లో చేసినప్పుడు వాళ్లు వయసులో బాగా పెద్దవాళ్లు కాబట్టి ఫ్రీగా మాట్లాడలేకపోయేదాన్ని. వాళ్లు ఫ్రెండ్లీగా ఉన్నా నేను ఉండలేక పోయేదాన్ని. చిరంజీవిగారితో ఆ ప్రాబ్లమ్ లేదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. దాంతో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.
 
  మీ ఫ్రెండ్‌షిప్ షూటింగ్స్ వరకేనా.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారా?
 సురేఖగారు (చిరంజీవి సతీమణి) నాకు బాగా తెలుసు. చాలా ఫ్రెండ్లీ టైప్. ఒకసారి షూటింగ్‌కి వచ్చారు.  ఆ తర్వాత చాలా సందర్భా ల్లో కలిశాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. చిరంజీవి గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌నీ బాగా బ్యాలెన్స్ చేసుకునేవారు. అది నాకు ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది.
 
 అప్పట్లో మీ అమ్మగారు షూటింగ్‌కి వచ్చేవారా...?
 ఆల్‌మోస్ట్ వచ్చేవారు. మా అమ్మగారు కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉండేవారు. ఆవిడంటే చిరంజీవిగారికి ఇష్టం. చాలా బాగా మాట్లాడేవారు. మా అమ్మకి ఓ నిక్‌నేమ్ కూడా పెట్టారాయన. ‘హిట్లరమ్మ ఎక్కడ?’ అని సరదాగా అనేవారు. మా అమ్మగారు కూడా చిరంజీవిగారంటే అభిమానంగా ఉండేవారు.
 
 1980 రీ యూనియన్ పేరుతో ప్రతి ఏడాది మీరంతా కలుస్తుంటారు కదా
 అప్పట్లో యాక్ట్ చేసిన మేమంతా కలుస్తుంటాం. చెన్నై, బెంగళూరు.. ఇలా ఒక్కోసారి ఒక్కో చోట కలుస్తుంటాం. ఓసారి చిరంజీవిగారు హైదరాబాద్‌లో తన ఇంట్లో ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటలు తయారు చేయించారు. ఎవరికీ బోర్ కొట్టకుండా ఉండేలా ఎంటర్‌టైన్ మెంట్ ప్లాన్ చేశారు. అందరూ కంఫర్ట్‌గా ఉన్నారా? అని మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత మంచి హోస్టో అప్పుడు తెలిసింది. చిరంజీవిగారు నైస్ పర్సన్. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
 
  ఆ పాట ఓ చాలెంజ్
 ‘స్టేట్ రౌడీ’లోని ‘రాధ రాధ మదిలోన మన్మథ బాధ...’ పాట నాకో చాలెంజ్. ఆ పాట కోసం టైట్ ప్యాంటు, షర్టు వేసుకున్నాను. తారా మాస్టర్ చాలా హెవీ స్టెప్స్ సమకూర్చారు. కాలు బాగా పెకైత్తి డ్యాన్స్ చేయాలి. కానీ, నేను వేసుకున్న ప్యాంటు టైట్ కాబట్టి ఆ స్టెప్స్ చేయలేననుకున్నాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మామూలుగా చేశాను.. షూట్ చేసేటప్పుడు ప్యాంటు చిరిగితే చిరిగిందిలే అనుకుని రెచ్చిపోయి డ్యాన్స్ చేశాను. పక్కన హీరో దూకుడుగా స్టెప్స్ వేస్తుంటే నేనెందుకు తగ్గాలన్నది నా పట్టుదల (నవ్వుతూ).

 

>