తెరపై వినోదాల విందు... ఎక్స్‌ప్రెస్ రాజా

12 Jan, 2016 00:13 IST|Sakshi
తెరపై వినోదాల విందు... ఎక్స్‌ప్రెస్ రాజా

2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు.  

సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్... ఎంటర్‌టైన్‌మెంట్... ఎంటర్‌టైన్‌మెంట్ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ, గత దశాబ్ద కాలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న చిత్రాలు మినిమమ్ గ్యారంటీతో సూపర్‌డూపర్ హిట్స్ అవుతున్నాయి. అగ్ర హీరోలు సైతం ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకోవడం విశేషం.

ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదలైన ఏ చిత్రాన్ని తీసుకున్నా అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్దపీట వేసినవే. 2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో ఎంటర్‌టైన్‌మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. దానికి తోడు యువి క్రియేషన్స్ సంస్థ తమ చిత్రాల్లో తప్పనిసరిగా వినోదం ఉండేలా చూసుకుంటుంది.

గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి. ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంలో ప్రమోషన్ కూడా తారస్థాయిలో చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం కౌంట్ డౌన్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల అందరి ప్రశంసలూ అందుకుంటున్న ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రంలో నటించారు.
 
ఇందులో ప్రభాస్ శ్రీను - మావయ్య శ్రీనుగా నటిస్తున్నారు. మొట్ట మొదటిసారి హీరోతో సమానంగా నవ్వులు కురిపించే పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్‌లో పనీపాటా లేనివారి జాబితాలో రెండవ స్థానం దక్కించుకుని మొదటి స్థానం కోసం గొడవ పడే చక్కటి పాత్రలో ఆయన నటించారు. ప్రభాస్ శ్రీను కెరీర్‌లోనే ఈ పాత్ర నిలిచిపోయేలా ఉంటుంది. ధన్‌రాజ్ ‘ఇనుము’ అనే పాత్రలో నటిస్తున్నారు.

ధన్‌రాజ్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. నవ్వించటంతో పాటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు.
 అలాగే ఈ మధ్య అందరి ప్రశంసలు అందుకుంటున్న బ్రహ్మాజీ ‘బిల్‌గేట్స్’ పాత్రలో, ‘షకలక’ శంకర్ ‘బీభత్స నటరాజ్’ పాత్రలో డ్రామా ఆర్టిస్ట్‌గా నటించారు. ‘షకలక’ శంకర్ ఇందులో మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ చేసిన గెటప్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.
 
ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో కమెడియన్‌గా స్థిరపడిన సప్తగిరి ఈ చిత్రంలో ‘పొల్యూషన్ గిరి’గా మరొక్కసారి తన విశ్వరూపం చూపించారు. సప్తగిరి నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇలా కథతో పాటూ కథనంతో పాటూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్మి నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే చక్కటి వినోదం ఉండాలి. అలాంటి ఫుల్‌మీల్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు కూడా అందుకుంటుంది. ఈ సంక్రాంతిని వినోదాల ఎక్స్‌ప్రెస్ చేస్తుందనడంలో సందేహం లేదు.