‘లంకేశ్​’డు చనిపోలేదు

4 May, 2020 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను బతికే ఉన్నానని దూరదర్శన్‌ రామాయణ్‌ సీరియల్‌లో రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది లంకేశ్‌(82) వెల్లడించారు. ఆయన చనిపోయినట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఇది నిజమా, కాదా తెలుసుకునేందుకు అభిమానులు ట్విటర్‌ ద్వారా లంకేశ్‌ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. దీంతో తాను బతికేవున్నానని ఆయన ప్రకటించారు. 

లంకేశ్‌ చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన మేనల్లుడు కౌస్తుభ్‌ త్రివేది తోసిపుచ్చారు. ‘మా అంకుల్‌ అరవింద్‌ త్రివేది లంకేశ్‌ క్షేమంగా ఉన్నారు. దయచేసి ఆయనపై అసత్య ప్రచారం ఆపండి. ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ  తెలియజేయాల’ని కౌస్తుభ్‌ ట్వీట్‌ చేశారు. లంకేశ్‌ కూడా ఇదే ట్వీట్‌ను హిందీలో తన ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రామాయణ్‌ సీరియల్‌ను దూరదర్శన్‌ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. రావణ పాత్రధారి అరవింద్‌ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో ఇటీవల వైరల్‌ అయింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 16న రామాయణ్‌ను 7.7 కోట్లు వీక్షించడంతో కొత్త రికార్డు నమోదయింది. రామానంద సాగర్‌ రచించి, దర్శకత్వం వహించిన ‘రామాయణ్‌’ ధారావాహిక విడుదలైన 33 ఏళ్ల తర్వాత కూడా భారతీయ టెలివిజన్‌ ప్రపంచాన్ని ఏలుతుండటం విశేషం.  

చదవండి: డీడీ నంబర్‌ వన్‌

మరిన్ని వార్తలు