12 సార్లు చెంప దెబ్బ కొట్టా

15 Feb, 2019 06:32 IST|Sakshi
వివేక్‌సాగర్, కరాటే రాజు, విష్వక్‌సేన్, తరుణ్‌ భాస్కర్‌

– తరుణ్‌ భాస్కర్‌

‘‘హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతంలోని వాస్తవికతను ‘ఫలక్‌నుమాదాస్‌’ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు విష్వక్‌ సేన్‌. ఈ సినిమా షూటింగ్‌లో 12 సార్లు విష్వక్‌ను చెంప దెబ్బ కొట్టా. ఇంకా గట్టిగా కొట్టు అనేవాడు. అంత డెడికేటెడ్‌గా వర్క్‌ చేశాడు’’ అని డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ అన్నారు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల్లో నటించిన విష్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. కరాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్‌ సేన్‌ సినిమాస్, టెరనోవ పిక్చర్స్‌ అనుసంధానంతో పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. తరుణ్‌ భాస్కర్‌ పోలీస్‌ అధికారిగా కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా ట్రైలర్‌ని విష్వక్‌సేన్‌ తల్లి దుర్గ రిలీజ్‌ చేశారు. హీరో, దర్శకుడు విష్వక్‌సేన్‌ మాట్లాడుతూ–  ‘‘ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్‌ విడుదల చేయడానికి కారణం ఈ సినిమా నా గర్ల్‌ ఫ్రెండ్‌. ఏడాదిగా ఈ సినిమాతోనే గడిపాను. ఇది చిన్న సినిమా కాదు.. దయచేసి అలా రాయొద్దు, మాట్లాడొద్దు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్‌ అవసరమో అంత పెట్టాను. చాలా పెద్ద సినిమా.. కాకపోతే చిన్నోడు తీశాడంతే’’ అన్నారు. ‘‘20 నుంచి 25 సంవత్సరాల వయసుండే 40 మంది కుర్రాళ్లంతా కష్టపడి ఈ సినిమా చేశారు. మొత్తం మీద అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. హైదరాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయని ఎవరికీ తెలియని 118 లొకేషన్స్‌లో తీశాం’’ అని నిర్మాత కరాటే రాజు చెప్పారు. సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, నటుడు కౌశిక్, రచయిత కిట్టు విస్సా ప్రగడ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు