‘ఫలక్‌నుమా దాస్’ మూవీ రివ్యూ

31 May, 2019 10:25 IST|Sakshi

టైటిల్ : ఫలక్‌నుమా దాస్
జానర్ : యాక్షన్‌ డ్రామా
తారాగణం : విశ్వక్‌ సేన్‌, సలోని మిశ్రా, హర్షిత గౌర్‌, తరుణ్ భాస్కర్‌
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : విశ్వక్‌ సేన్‌
నిర్మాత : కరాటే రాజు

వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఫలక్‌నుమా దాస్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్‌ తో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. వీటికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం చేసిన అతి కూడా తోడైంది. ఏకంగా ఈ చిత్రాన్ని తెలుగులో కల్ట్‌ క్లాసిక్ గా నిలిచిన శివ చిత్రంతో పోల్చారు. మరి చిత్ర యూనిట్ హీరో కం దర్శకుడు చేసిన హడావిడి వారు చెప్పినట్టుగా ఈ చిత్రం నిజంగానే మరో శివ అనిపించుకుందా?  దర్శకుడిగా మారిన హీరోని విజయం వరించిందా? ఓ సారి చూద్దాం.

కథ :
ఫలక్‌నుమా లోని దాస్ (విశ్వక్‌ సేన్‌) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది ఈ కథ. దాస్‌ చిన్నప్పట్నుంచి ఆ ఏరియా లోని శంకర్ అనే దాదాని చూసి పెరుగుతాడు. పెద్దయ్యాక శంకర్ లా అవ్వాలని కలలు కంటాడు. చిన్నప్పుడే ఓ గ్యాంగ్‌ని కూడా తయారు చేసుకుంటాడు. ఈ చోట గ్యాంగ్ కు శంకరన్న సపోర్ట్ కూడా ఇస్తాడు. స్కూల్ ఏజ్‌ లోనే శంకర్ గ్యాంగ్ తో తింటూ తిరుగుతూ సరదాగా గడిపేస్తుంటారు. కాలేజీలో అడుగుపెట్టాక ప్రేమ, గొడవలతో దాస్ జీవితం గడుస్తుండగా శంకర్ హత్యకు గురవుతాడు. రవి, రాజు అనే వ్యక్తులు శంకర్‌ను హత్య చేస్తారు.

శంకర్ హత్యతో  గ్యాంగ్ ఒంటరి అయిపోతుంది. అప్పటి వరకు హాయిగా బతికిన ఈ గ్యాంగ్‌కు కష్టాలు మొదలవుతాయి. వీటి నుంచి బయట పడటానికి ఒక బిజినెస్ చేద్దామని ఫలక్‌నుమా ఏరియాలో మటన్ షాప్ ప్రారంభిస్తారు. అప్పటికే మటన్ బిజినెస్ లో రవి, రాజుదే పైచేయి ఉంటుంది. కానీ దాస్ బిజినెస్‌ స్టార్‌ చేశాక వారి బిజినెస్‌ స్లో అవుతుంది. దాస్ గ్యాంగ్ తమ వ్యాపారానికి అడ్డు వస్తుందని  రవి, రాజు గొడవకు దిగుతారు. ఆ గొడవలో దాస్ మటన్ షాప్ పై నాటు బాంబు వేస్తారు. ఇక అప్పటి నుంచి మొదలైన గొడవలు ఓ హత్యకు దారి తీస్తాయి. దాస్ నాటు బాంబు విసరడంతో ఓ వ్యక్తి చనిపోతాడు. ఇక అప్పటినుంచి దాస్ జీవితం మారిపోతుంది. ఆ కేసు నుంచి బయట పడడానికి దాస్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తుంది. చివరకు దాస్ ఆ కేసు నుంచి బయట పడ్డాడా? బయటపడడానికి చేసిన ప్రయత్నాలేంటి? అనేది మిగతా కథ.

నటీనటులు :
తెలంగాణ యాసతో పక్కా హైదరాబాది కుర్రాడిలా దాస్ పాత్రలో విశ్వక్ సేన్ పర్వాలేదనిపించాడు. ఆ పాత్రకు తగ్గట్టు భాషను యాసను బాడీ లాంగ్వేజ్ ను మెయింటైన్ చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం తేలిపోయాడు. భావోద్వేగాలను సరిగా పండించలేకపోయాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఏ ఒక్కరూ మెప్పించలేకపోయారు. లుక్స్ పరంగా నటన పరంగా ప్రేక్షకులను అలరించలేక పోయారు.

దర్శకుడి నుంచి నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ మంచి పాత్రలో కనిపించాడు. ఓ దర్శకుడు నటుడిగా మారితే ఎంతగా మెప్పించగలరో చూపించాడు. సైదులు పాత్రలో తరుణ్ జీవించాడనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండు పాత్ర గురించి, ఉత్తేజ్ ఈ పాత్రను తన అనుభవంతో అవలీలగా చేసేసాడు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ రీమేక్ రైట్స్‌ను కొనుక్కొని మరీ దర్శకుడు అవతారం ఎత్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు విశ్వక్. అయితే ఇదేమీ కొత్త కథ కాదు. బస్తి గొడవలు గ్యాంగ్ వార్స్ అల్లరి చిల్లరిగా తిరిగే హీరో, హీరో చుట్టూ నలుగురు స్నేహితులు ఈ కాన్సెప్ట్ తో మనం ఎన్నో సినిమాలు చూసేసి ఉన్నాం. తెలుగు ప్రేక్షకులకు ఇది రొటీన్‌ కథ లాగే అనిపిస్తుంది.

దర్శకుడిగా విశ్వక్‌ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఒరిజినల్‌ కథకు మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఆకట్టుకునేలా తెరపై చూపించలేకపోయాడు. తెరపై ఎంతసేపు గొడవలు పడటం,  బూతులు తిట్టుకోవడం, తాగడం, తిరగడం ఇవే కనబడుతూ ఉంటాయి. కథానాయికల పాత్రలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా ఏ ఒక్కరూ కనిపించలేదు.. నటించలేదు.

ప్రతీ సన్నివేశంలో దర్శకుడి అనుభవలేమి కనబడుతుం‍ది. అనవసరమైన సన్నివేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇందులో సాగదీస్తూ తీసిన సన్నివేశాలు ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తాయి.  నటుడిగా పరవాలేదనిపించిన విశ్వక్ దర్శకుడిగా మెప్పించలేకపోయాడు. కేవలం బోల్డ్‌ డైలాగ్స్‌ను నమ్ముకొని సినిమా చేశారన్న భావన కలుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివతో పోల్చారు గాని.. ప్రేక్షకుడికి ఏ స్థాయిలోనూ అలాంటి ఫీలింగ్ కలగదు.

యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం  ఆ వర్గం ప్రేక్షకుల్ని  కొంతమేరకు ఆకట్టుకోవచ్చు. వివేక్ సాగర్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే కొన్ని సన్నివేశాల్లో అందించిన నేపధ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరామెన్ హైదరాబాద్ ఆర్కిటెక్చర్‌ తో పాటు ఇక్కడి బస్తీల పరిస్థితులను అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బాగానే బంధించాడు. ఎడిటర్‌ ఇంకా కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఈ బలాలు బలహీనతలు చెప్పుకోకుండా ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ జాబితాను మనం తీస్తే అన్ని బలహీనతలే కనిపిస్తాయి.

-బండ కళ్యాణ్, ఇంటర్ నెట్ డెస్క్.

Poll
Loading...
మరిన్ని వార్తలు