రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!

7 Apr, 2020 00:36 IST|Sakshi
అమితాబ్‌,రజనీకాంత్, చిరంజీవి,మమ్ముట్టి

కార్మికులకు అమితాబ్‌ సాయం

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇంటి పట్టునే ఉండిపోయిన ‘ఫ్యామిలీ’ల కోసం ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబాలను ఉత్సాహపరచడానికి, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఉపయోగపడనుంది. అమితాబ్‌ ప్రోద్బలంతో సోనీ నెట్‌వర్క్‌ సహాయంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ తయారవుతోంది. ప్రసిద్ధ యాడ్‌ డైరెక్టర్‌ ప్రసూన్‌ పాండే వర్చువల్‌గా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ కుటుంబాలకు ఐదు విషయాలను చెప్పనుంది. ‘ఇంట్లో ఉండండి’, ‘సురక్షితంగా ఉండండి’, ‘చేతులు కడుక్కోండి’, ‘ఇంటి నుంచి పని చేయండి’, ‘భౌతిక దూరం పాటించండి’... అని సృజనాత్మకంగా చెప్పనుంది.

భారతీయులందరినీ ఉత్సాహపరచాలి కనుక ఈ షార్ట్‌ఫిల్మ్‌లో భారీ తారాగణం లిప్తపాటు కనిపిస్తారట. వారిలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ తదితరులు ఉంటారు. ఏప్రిల్‌ 6న రాత్రి 9 గంటలకు ఈ షార్ట్‌ఫిల్మ్‌ దేశమంతా ప్రముఖ చానెళ్లలో ప్రసారం కానుంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ గురించే కాక దేశంలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న స్థాయి కార్మికులు లక్షమందికి సోనీ నెట్‌వర్క్, కల్యాణ్‌ జువెలర్స్‌తో కలిసి అమితాబ్‌ ఒక నెల వెచ్చాలను అందించనున్నారు. సూపర్‌మార్కెట్‌లతో ఏర్పాటు చేసుకున్న కూపన్లు కార్మికులకు అందేలా చేసి వెచ్చాలను అందించనున్నారు.

మరిన్ని వార్తలు