ఈ ఏడాదిలో ఇదే బంపర్ రికార్డు..

19 Apr, 2016 10:04 IST|Sakshi
ఈ ఏడాదిలో ఇదే బంపర్‌ రికార్డు..
షారుక్ ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్' సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన తొలి వారాంతంలోనే రూ.52.35 కోట్లు కలెక్ట్ చేసి.. 2016లో తొలి వీకెండ్లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.44.30 కోట్ల కలెక్షన్లతో తొలి స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్‌ 'ఎయిర్ లిఫ్ట్' ను ఫ్యాన్ అధిగమించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 52 కోట్ల అదిరే కలెక్షన్లను సొంతం చేసుకుంది. 
 
ఆర్యన్ ఖన్నా అనే సినీ హీరోను అమితంగా అభిమానించే గౌరవ్ అనే కుర్రాడు.. కొన్ని సంఘటనల అనంతరం అతడిని ద్వేషించడం మొదలుపెడతాడు. సదరు ఫ్యాన్కి, సినీ హీరోకి మధ్య జరిగే కథే 'ఫ్యాన్'  సినిమా. షారుక్.. ఆర్యన్గా, గౌరవ్గా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడు అబ్ రామ్ సినిమా చూస్తూ 'టూ టూ పప్పాస్' (ఇద్దరిద్దరు నాన్నలు) అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసిన విషయాన్ని మురిసిపోతూ ట్వీట్ చేశాడు కింగ్ ఖాన్. 
 
ఫ్యాన్ సృష్టిస్తున్న రికార్డులను చూసి కింగ్ ఖాన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. కాగా 2015లో సల్మాన్ 'భజరంగీ భాయ్ జాన్' రూ.102.6 కోట్ల తొలి వీకెండ్ కలెక్షన్లతో సునామీ సృష్టించగా.. ఆమిర్ 'పీకే' రూ. 95.21 కోట్ల కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. చూడబోతే ఫ్యాన్ ఈ ఏడాది భారీ వసూళ్ల లిస్ట్లో చేరే అవకాశం కనిపిస్తోంది.