పూజా కోసం ఐదు రోజులు ఫుట్‌పాత్‌పై..

15 Jan, 2020 16:55 IST|Sakshi

కొందరు తమ అభిమాన సినీ తారలను కలుసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. షూటింగ్‌ ప్లేస్‌లకు, ఏదైనా ఈవెంట్‌లు జరిగే చోట్లకి వెళ్లి వారిని కలవాలని చూస్తారు. కానీ భాస్కర్‌ రావు అనే అభిమాని మాత్రం హీరోయిన్‌ పూజా హెగ్డేను కలిసేందుకు ఐదు రోజులు నిరీక్షించాడు. ఐదు రాత్రులు ఫుట్‌పాత్‌పైనే పడుకున్నాడు. ఈ విషయాన్ని పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. భాస్కర్‌రావుతో జరిపిన సంభాషణ వీడియోను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. డీజే సినిమా అప్పటినుంచి పూజా అంటే అభిమానమని భాస్కర్‌రావు చెప్పారు. ఐదు రోజులుగా రోడ్లపై పడుకున్నానని భాస్కర్‌రావు చెప్పడంతో.. ఇంకెప్పుడూ అలా చెయ్యవద్దని పూజా కోరారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని సూచించారు.  అవసరమనుకుంటే సోషల్‌ మీడియాలో మెసేజ్‌ చేయవచ్చని చెప్పారు. 

‘నన్ను కలవడానికి ముంబైకి వచ్చి ఐదు రోజుల పాటు వెయిట్‌ చేసినందుకు భాస్కర్‌ రావుకు థ్యాంక్యూ. ఈ విషయం నన్ను కదిలించింది.. కానీ నా అభిమానులు ఇలా ఇబ్బంది పడటం బాధ కలిగిస్తోంది. నా కోసం అభిమానులు ఇలా చేయడాన్ని నేనెప్పుడు కోరుకోను. మీరు ఎక్కడున్నా.. మీ ప్రేమను, అభిమానాన్ని  నేను పొందుతూనే ఉంటాను. మీరే నాకు బలం. లవ్‌ యూ ఆల్‌.. ’ అని పూజా పేర్కొన్నారు. కాగా, అల్లు అర్జున్‌తో కలిసి పూజా నటించిన అల.. వైకుంఠపురములో.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పూజా బిజీబిజీగా గడిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా