రాజకీయాల్లోకి రా...

21 Jun, 2019 07:42 IST|Sakshi

‘దళపతి’కి అభిమాన ‘ఆహ్వానం’

విజయ్‌ బర్త్‌డే వేళ పిలుపు 

మదురైతో పాటు పలు నగరాల్లో పోస్టర్ల హల్‌చల్‌

ప్రజా, రేపటి సీఎంగా నినాదాలు

సాక్షి, చెన్నై: ఇళయదళపతి విజయ్‌కు రాజకీయ ఆహ్వానం పలుకుతూ అభిమానులు పలు నగరాల్లో పోస్టర్లు హోరెత్తించే పనిలో పడ్డారు. శనివారం ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని ఇ ప్పటి నుంచే అభిమానుల్లో అత్యుత్సాహం, హంగామా పెరిగింది. ప్రజా సీఎం, రేపటి సీఎం అం టూ నినాదాల్ని, దళపతి రాజకీయాల్లోకి రా.. అ న్న పిలుపుతో ఈ పోస్టర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.  సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత అంతటి అభిమాన లోకాన్ని కల్గిన హీరోలుగా ఇళయదళపతి విజయ్, తల అజిత్‌ ఉన్నారు. వీరిలో ఇళయదళపతి పేరు మాత్రం తరచూ రాజకీయ చర్చల్లో నానుతూ ఉంటుంది. ఇందుకు కారణం ఆయన తండ్రి, దర్శక, నిర్మాత ఎస్‌ఏ చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు.  తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకు రావడం లక్ష్యంగా ఆయన తీవ్రంగానే కసరత్తుల్లో ఉన్నారు. విజయ్‌ అభిమాన సంఘాల ద్వారా సేవల్ని విస్తృతం చేయిస్తున్నారు. గతంలో అయితే, విజయ్‌ రాజకీయ అరంగేట్రం ఇక, చేసినట్టే అన్నట్టుగా ప్రచారం జోరుగానే సాగింది. ఇది అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహానికి దారి తీసింది. అయితే, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ తన మద్దతును అన్నాడీఎంకేకు ప్రకటించడం అభిమానుల్లో నిరుత్సాహాన్ని నింపింది. అదే రాజకీయంగా చర్చను రగిల్చింది. ఈ ఎన్నికల్లో విజయ్‌ అభిమానులు జెండాలు చేత బట్టి మరీ స్వయంగా ప్రచారంలో దూసుకెళ్లారు. ఇక, ఆ తదుపరి పరిణామాలతో విజయ్‌ నటించిన తలైవా చిత్రం చిక్కుల్లో పడడం, వివాదాలు వంటి ఘటనలు వెలుగు చూశాయి.  దీంతో దళపతి రాజకీయాల్లోకి రా.. అంటూ అభిమానులు జెండా పట్టడం, చివరకు బుజ్జగింపులు జరగడం చోటుచేసుకున్నాయి. చివరకు తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. అదే సమయంలో  2014 బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ కావడం మరో చర్చకు దారి తీసింది. ఇలా చర్చలు, ప్రచారాలు, అభిమానుల పిలుపుకే ఈ దళపతి రాజకీయ ప్రవేశం పరిమితమైంది. 

మరో మారు తెరపైకి..
శనివారం విజయ్‌ 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో జోష్‌ నిండింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరో మారు దళపతి రాజకీయ ప్రవేశ నినాదం మిన్నంటే రీతిలో అభిమానులు దూకుడు పెంచారు. మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి వంటి నగరాల్లో ఉన్న అభిమానులు అత్యుత్సాహంతో దూసుకెళ్లే పనిలో పడ్డారు. మదురై నగరం అంతా ఎక్కడ చూసినా దళపతి రాజకీయల్లో రా.. అని పిలుపునిస్తూ పోస్టర్లు హల్‌చల్‌ చేస్తుండడం విశేషం. ఇక, కొన్ని చోట్ల అయితే, రేపటి సీఎం మరికొన్ని చోట్ల ప్రజా సీఎం అంటూ, అధికార పీఠం అధిరోహిద్దాం అంటూ తమకు నచ్చినట్టుగా తమ హీరోను పిలుచుకుంటూ నినాదాల్ని అభిమానులు పోస్టర్ల ద్వారా హోరెత్తించడం గమనించదగ్గ విషయం. బర్త్‌డే వేళ నిర్ణయం తీసుకోవాల్సిందే అని పిలుపు నిస్తూ మరికొన్ని చోట్ల పోస్టర్లు వెలియడం విశేషం. అయితే, అభిమానుల పిలుపునకు దళపతి స్పందించేనా అన్నది వేచి చూడాల్సిందే. అదే సమయంలో అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా పోస్టరును మాత్రం అభిమానులకు జోష్‌ను నింపే విధంగా విజయ్‌ విడుదల చేసే అవకాశాలు ఎక్కువే.   
 

మరిన్ని వార్తలు