కళాభవన్ మణి మృతిపై అనుమానాలు!

7 Mar, 2016 20:00 IST|Sakshi
కళాభవన్ మణి మృతిపై అనుమానాలు!

చలక్కుడి(కేరళ): ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. అభిమానులు, సన్నిహితులు, సహనటులు ఆయనకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. చివరిసారిగా 'పేదల సూపర్ స్టార్'ను దర్శించుకునేందుకు జనం పోటెత్తడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని మూడు ప్రాంతాల్లో ఉంచారు. పలువురు రాజకీయ ప్రముఖులు కళాభవన్ మణి పార్థీవదేహానికి నివాళి అర్పించారు.

త్రిశూర్ జిల్లా చలక్కుడిలోని సొంత నివాసంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కళాభవన్ మణి సోదరుడి కుమారుడు దినేశ్.. ఆయన చితికి నిప్పటించారు. ఈ సమయంలో అభిమానుల రోదనలు మిన్నంటాయి. మండుతున్న చితికి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులను పోలీసులు వెనక్కు లాక్కేళ్లారు.

కాగా, కళాభవన్ మణిది సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అంతర్గత అవయవాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. కళాభవన్‌ మణి శరీరంలో అనుమానాస్పద రసాయన పదార్థం గుర్తించినట్టు కొచ్చి ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో అసహజ మరణంగా ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

కళాభవన్‌ మణి చివరిసారిగా గడిపిన అవుట్ హౌస్ లో ఈ ఉదయం ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడి నుంచే కళాభవన్ మణిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. మద్యపానం అలవాటున్న ఆయన లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారని అంతకుముందు వైద్యులు తెలిపారు.