సమంతకు అభిమానుల షాక్!

29 Jun, 2016 11:54 IST|Sakshi
సమంతకు అభిమానుల షాక్!

నటి సమంత కారును పంక్చర్ చేసిన సంఘటన ఆమెను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్కోసారి అభిమానం హద్దులు మీరితే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. చెన్నై చిన్నది సమంత విషయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ సుందరి సోమవారం ఒక షాపు ప్రారంభోత్సవానికి మదురై వెళ్లారు.

అమ్మడి రాక ఆ ప్రాంత ప్రజలకు తెలియడంతో ఆమె అభిమానులు, చుట్టుపక్కల ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. దీంతో నిర్వాహకులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమంత వేదికపైకి రాగానే ఆమెను దగ్గరగా చూడాలన్న కోరికతో ప్రజలు ఒక్కసారిగా ముందుకు కదిలారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలానే శ్రమపడాల్సి వచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక తుంటరి సమంత అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోకూడదని ఆమె కారు టైరును పంక్చర్ చేశాడు. దీంతో కారు టైరు పగిలి, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. ఈ సంఘటనతో సమంత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఆమెను నిర్వాహకులు వేరే కారులో సురక్షితంగా పంపారు.