భాష లేనిది.. బంధమున్నది

13 Feb, 2019 09:36 IST|Sakshi
పిల్లలతో నిహారికారెడ్డి, కన్నన్‌

మా ఇద్దరినీ జత కలిపినది

ఫ్యాషన్‌ డిజైనర్‌ నిహారికారెడ్డి, రచయిత,  దర్శకుడు కన్నన్‌ 

రేపు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేక కథనం  

శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్‌): వారి ప్రాంతాలు వేరు.. భాష వేరు.. కానీ.. ఆ ఇద్దరినీ ప్రేమ కలిపింది.. సినిమా ఇండస్ట్రీలో పరిచయం.. ప్రేమ.. పెళ్లి.. ఒకరి కోసం ఒకరు.. అన్నట్లుగా జీవిస్తున్నారు. వారెవరో కాదు.. అందరికీ సుపరిచితమైన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నిహారికారెడ్డి, రచయిత, దర్శకుడు కన్నన్‌ డీఎస్‌ (దొరస్వామి) దంపతులు. వీరిద్దరి పరిచయం.. ప్రేమ..పెళ్లి.. తదితర విషయాలను రేపు ప్రేమికుల రోజు సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి వారి మాటల్లో..

కన్నన్‌.. 
మాది తిరువణ్నామలై (అరుణాచలం). బీఎస్సీలో ఉన్నప్పుడే కాలేజీలో థియేటర్‌లో చురుకుగా పాల్గొనేవాడిని. నేను బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ని కూడా. ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎం.ఏ. ఎంఫిల్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ చేశాను. యూనివర్సిటీలో కొత్తవారికి నేనే ట్రైనింగ్‌ ఇచ్చేవాడిని. అలా కమల్‌హాసన్‌ సత్యం–శివం– సుందరం సినిమాకి స్క్రిప్ట్‌లో వర్క్‌ చేశాను. ఈ తర్వాత కుమార్‌ అనే ఫ్రెండ్‌ ద్వారా రచయిత విజయేంద్రప్రసాద్‌ పరిచయమయ్యారు. అలా ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ సినిమాలకు కథతో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. స్వీయ దర్శకత్వంలో సారాయి వీర్రాజు చిత్రాన్ని చేశాను. ప్రస్తుతం తమిళంలో విజయ్‌– అట్లీ చిత్రానికి, మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ చిత్రాలకు పనిచేస్తున్నాను.

మొదట భయపడ్డారు: నిహారికారెడ్డి
కన్నన్‌తో పెళ్లంటే మొదట పెద్దమ్మ, పెద్దనాన్న భయపడ్డారు. గడ్డంతో విలన్‌లా ఉన్నాడని అన్నారు. మన ప్రాంతం, మన భాష కాదన్నారు. చాలా మంది కన్నన్‌ గురించి చెప్పడంతో పాటు నా ఇష్టాన్ని గౌరవించారు. ఆ తర్వాత రెండు నెలలకే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు 18 ఏళ్లే. నా జీవితంతో మరిచిపోలేని సంఘటన నా పెళ్లి. మా వివాహానికి రాజమౌళి, క్రిష్, వీవీ వినాయక్, కీరవాణి, అజయ్, కృష్ణుడు, మెహర్‌ రమేష్, కళ్యాణి మాలిక్, తేజ వచ్చారు. మొత్తానికిమా వాడితో గడ్డం తీయించావు. మంచోడు.. కానీ మొండోడు అని ఆయన గురించి అంతా నవ్వుతూ అనేవారు.  

ప్రేమ మార్పునుతీసుకొస్తుంది: కన్నన్‌
చిన్నప్పుడు అమ్మ ప్రేమను చూస్తాం. పెద్దయ్యాక మన మేనరిజంలో మార్పు వస్తుంది. చాలా టెంపర్‌గా ఉండే నన్ను ప్రేమ మార్పు తీసుకువచ్చింది. మాకు మొదట పాప పుట్టింది. పూర్ణజ్ఞాన అని తనికెళ్ల భరణి పెట్టారు. మేము పూర్ణజ్ఞాన ఐశ్వర్యగా పిలుస్తున్నాం. తర్వాత బాబు పుట్టాడు. నాకు చెగువేరా అనే చాలా ఇష్టం. దాంతో యశో చెగువేరా అని పెట్టాం. నాకు నిహారిక.. పిల్లలు.. సినిమానే ప్రపంచం. ప్రస్తుతం ‘సైరా’ చేస్తున్నాను.  


 యాత్ర చిత్రంలో నిహారికారెడ్డి

నిహారికారెడ్డి..
మాది అనంతపురం జిల్లా కదిరి. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నాన్న మరో పెళ్లి  చేసుకుని వెళ్లిపోయారు. పెద్దమ్మ, పెదనాన్న నాకు అన్నీ అయి పెంచారు. ఆటుపోట్ల మధ్య నా జీవితం సాగింది. ఇంటర్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. చాలా కష్టాలను చవిచూశాను. దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ క్రమంలో ఓసారి ప్రసాద్‌ ల్యాబ్స్‌లో  నేను నటించిన ‘నిన్ను కలిశాక’ చిత్ర ప్రివ్యూలో ఓ ఫ్రెండ్‌ కన్నన్‌ను నాకు పరిచయం చేశాడు. అలా ఆ సినిమా ప్రివ్యూ చూశాం. ఆ తర్వాత నిత్యం ఫోన్‌లోమాట్లాడుకునే వాళ్లం.

అలా స్నేహం.. ప్రేమ.. పెళ్లి: కన్నన్‌
నేను చాలా టెంపర్‌ మనిషిని. ఏ విషయంలోనైనా కాంప్రమైజ్‌ కాని వ్యక్తిత్వం నాది. గడ్డంతో చాలా మాస్‌గా ఉండేవాడిని. సినిమాల్లోకి వచ్చాక సెట్‌లో వర్క్‌లో సీరియస్‌గా ఉండేవాడిని. నన్ను చూసి నీకు జీవితంలో పెళ్లి కాదు అనేవారు. నేను కూడా సన్యాసం తీసుకుందాం.. పెళ్లీ.. గిళ్లీ లేకుండా ఉందామనుకున్నా. సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌రెడ్డి నన్ను అఘోరా అని పిలుస్తాడు. సినిమానే లోకంగా జీవించేవాడిని. దర్శకుడు తేజ ఆఫీస్‌ దగ్గర నిహారికను చాలాసార్లు చూశాను. ఓసారి నేనే పలకరించా. ఆ తర్వాత ప్రసాద్‌ ల్యాబ్స్‌లో కలిశాం. అలా స్నేహితులమయ్యాం. ఓ రోజు ఇంటికి భోజనానికి రమ్మని నిహారిక పిలిచింది. అప్పుడే పెళ్లి ప్రస్తావన తెచ్చా. నాకు ఇష్టమే.. కానీ పెద్దమ్మ, పెదనాన్నదే తుది నిర్ణయమని చెప్పింది. తర్వాత మా కుటుంబికులతో మాట్లాడాను.

పెద్ద కూతురిలాచూసుకుంటారు: నిహారికారెడ్డి
కన్నన్‌ నన్ను ఓ పెద్ద కూతురిలా చూసుకుంటాడు. పెళ్లి తర్వాత నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.  నా ప్రతీ విజయంలో కన్నన్‌ వెన్నుదన్నుగా ఉన్నారు. మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా అవి తాత్కాలికమే. మా ఇంటికి వచ్చిన చాలా మంది నన్ను పొగడుతుంటారు. నిన్ను అమ్మా అని పిలుస్తూ ఓ కూతురిలా కన్నన్‌ చూసుకుంటాడని అంటుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ‘యాత్ర’ మూవీలో నటించా. నాకు ఈ చిత్రం రెండో ఇన్నింగ్స్‌ అని చెప్పవచ్చు. చిత్రం ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా అనిపించింది. వైఎస్సార్‌ పాలన చూడాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌తో పాటు అవకాశాలు వస్తే సినిమాల్లో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నాను. 

మరిన్ని వార్తలు