ఫ్యాషన్ డిజైనర్...s/o లేడీస్ టైలర్

27 Aug, 2015 00:28 IST|Sakshi
ఫ్యాషన్ డిజైనర్...s/o లేడీస్ టైలర్

వంశీ... ప్రముఖ కథా రచయిత, దర్శకుడు. ఆయన పేరు చెప్పగానే సాహిత్యాభిమానులకు ‘మా పసలపూడి కథలు’ గుర్తుకు వస్తాయి. సినిమా ప్రియులకు ‘సితార’, ‘అన్వేషణ’, ‘లేడీస్ టైలర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ లాంటి విభిన్న తరహా చిత్రాలు, వాటిలోని వినోదం జ్ఞాపకం వచ్చి, పెదవులపై చిరునవ్వు వెలుగుతుంది. మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి వంశీ సిద్ధమవుతున్నారు. ‘లేడీస్ టైలర్’లో ‘జమ జచ్చ’ అంటూ ‘జ’ భాష మాట్లాడే లేడీస్‌టైలర్ రాజేంద్రప్రసాద్ నుంచి ‘బట్టల సత్యం’ మల్లికార్జునరావు దాకా అన్ని పాత్రలూ గుర్తుండేలా చేసిన ఘనత వంశీది. ఇప్పుడు ఆ తరహాలో తాజా సినిమాకు నడుం బిగించారు. ప్రస్తుతం ఆయన ఆ స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారు. ఎవరికీ అందుబాటులో లేకుండా ఏకాంతంగా ఆలోచనలకు అక్షరరూపం ఇస్తున్నారు.
 
 సూపర్‌హిట్ ‘...టైలర్’కు సీక్వెల్?
 ‘సాక్షి’కి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్‌కు ‘ఫ్యాషన్ డిజైనర్... సన్నాఫ్ లేడీస్ టైలర్’ అని టైటిల్ పెట్టారు. సినిమాకు కూడా అదే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో యువతీ యువకులకు గిలిగింతలు పెట్టి, కామెడీలోనూ, పాటల్లోనూ చిరస్మరణీయంగా మిగిలిపోయిన ‘లేడీస్ టైలర్’కు ఇది ఒక సీక్వెల్‌లా ఉంటుందని కృష్ణానగర్ వర్గాల కథనం. అప్పటి సూపర్‌హిట్ ఫిల్మ్‌లో నటించిన రచయిత - నటుడు తనికెళ్ళ భరణి ఇప్పుడీ కొత్త సినిమాకు కథ అందిస్తున్నారు. రచయితగా సినీ రంగప్రవేశం చేసి, నటుడిగా మారాక కొన్నేళ్ళుగా సినీ రచనకు దూరంగా ఉన్న తనికెళ్ళ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కలం పట్టడం విశేషమే!
 
 టైటిల్ రోల్‌కు... సక్సెస్‌ఫుల్ హీరో
 ఇంతకీ ఈ సారి ఆధునిక లేడీస్ టైలర్‌గా... అదే... అదే... ఫ్యాషన్ డిజైనర్‌గా ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరమైన విషయమే. ఈ ‘సన్నాఫ్ లేడీస్ టైలర్’ పాత్రకు ప్రస్తుతం వరుస హిట్లతో జోరు మీదున్న యువ హీరో రాజ్ తరుణ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఏణ్ణర్ధం క్రితం ‘ఉయ్యాల జంపాల’, తాజాగా ‘సినిమా చూపిస్త మావ’ లాంటి హిట్స్‌తో రాజ్‌తరుణ్ ఇప్పుడు ట్రేడ్‌లోనూ, ఆడియన్స్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఉత్తరాంధ్ర యాస మీద పట్టున్న ఈ విశాఖపట్నం కుర్రాడు వంశీ మార్కు స్క్రిప్ట్‌కు సరిపోతాడని వేరే చెప్పనక్కర లేదు. ఇంకా ఇతర తారాగణం ఎవరన్నది తెలియాల్సి ఉంది. వంశీ రచనలన్నా, ఆయన సినిమాలన్నా అమితంగా ఇష్టపడే నిర్మాత - స్వయంగా దర్శకుడైన ‘మధుర’ శ్రీధర్ ఈ కొత్త ప్రాజెక్ట్‌కు నిర్మాణ సారథి. స్క్రిప్ట్ పని, ప్రీ-ప్రొడక్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకొని, నవంబర్ నుంచి సెట్స్ మీదకు ఈ సినిమాను తీసుకువెళ్ళనున్నట్లు భోగట్టా. మొత్తానికి, 1980లలో ‘లేడీస్ టైలర్’తో అందరినీ ఒక ఊపు ఊపేసిన వంశీ మళ్ళీ తన పాత వైభవం సంపాదించడానికి ఈ కొత్త ‘లేడీస్ టైలర్’ను
 మించినది  మరేముంటుంది!