బాక్సు బద్దలు కొట్టారు!

10 Apr, 2015 19:02 IST|Sakshi
బాక్సు బద్దలు కొట్టారు!

అవును! ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీ ధాటికి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలైంది. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 4006 స్క్రీన్లపై విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 7 కళ్లుతిరిగే  కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలోనే 2800 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 కావడం విశేషం.

గతంలో జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ సినిమా తొలివారంలో రూ.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ రికార్డును ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చెరిపేసింది. ఏప్రిల్ 2 నుంచి 10 వరకు సాధించిన ఈ వసూళ్లన్ని ప్రధానంగా మల్టీప్లెక్స్, మిని మల్టీప్లెక్స్ స్క్రీన్లద్వారా వచ్చినవేనని యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి సరబ్జిత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దాదాపు ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ సిసిమాను డబ్ చేయడం, కారుప్రమాదంలో మరణించిన పాల్ వాకర్ నటించిన చివరిచిత్రం కావడం, ఆద్యాంతం విస్మయం గొలిపే యాక్షన్ సీన్లు ఉండటం వల్లే ఈ మేరకు రికార్డు కలెక్షన్లు సాధ్యమయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.