ఇప్పుడు ఏమి చేయాలి ‘కరోనా’

28 Mar, 2020 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఆయన ఈ కామెంట్‌ చేసింది మనుషుల గురించి కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోరా మహమ్మారిని ఉద్దేశించి ఈ మాట అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో జనం ప్రాణాలను ‘కోవిడ్‌-19’ హరిస్తున్న నేపథ్యంలో బాధిత దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించాయి. మనదేశంలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అత్యవసర  సేవల సిబ్బంది తప్పా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

(చదవండి: ఆ హీరోయిన్‌కు క‌రోనా క‌ష్టం..)

ఈ నేపథ్యంలో రాంగోపాల్‌ వర్మ స్పందిస్తూ.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో ఏమీ తోచడం లేదని, సమయం అస్సలు గడవడం లేదని ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘నెలకు 30 రోజులు ఉంటాయని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ వెయ్యి రోజులు ఉంటాయని మొదటిసారి అనిపిస్తోంది. సమయం ముందుకు సాగడం లేదు. కరోనా భయంతో సమయంతో సహా అన్నింటిని ఆపేశారు. ఇప్పుడు ఏమి చేయాలి కరోనా’ అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం మీద కూడా ఆయన సెటైర్లు సంధించారు. 

భారీ సంఖ్యలో గుంపులు గుంపులుగా ఢిల్లీ-యూపీ సరిహద్దు దాటుతున్న వలస కార్మికుల వీడియోపై కామెంట్‌ చేస్తూ.. ‘హే రామ్‌, హే అల్లా, జీసెస్‌ ఎక్కడ ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న వలసకార్మికులు స్వస్థలాలకు కాలినడక నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కొకొల్లలుగా కన్పిస్తున్నాయి. దీంతో వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఇప్పటికే కోరింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)

మరిన్ని వార్తలు