జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం: రామ్‌లక్ష్మణ్‌

13 Jun, 2016 10:21 IST|Sakshi
జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం: రామ్‌లక్ష్మణ్‌

వెయ్యి సినిమాలకు ఫైట్‌ మాస్టర్లుగా పనిచేశారు. ఐదు సినిమాల్లో హీరోలుగా నటించారు. ఐదు పర్యయాలు నంది అవార్డులు తీసుకున్నారు. అయినా వారిలో ఓ విధమైన నిరాశనే ఉండేది. అలాంటి దశలోనే వృద్ధులకు, అనాథ పిల్లలకు, నిస్సహాయయులకు చేయూతను అందిస్తే... అన్న ఆలోచన వారిలోని మానవత్వాన్ని తట్టిలేపింది.

అంచలంచెలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అక్కడ వారికి దొరికిన ఆనందం... ఆత్మ సంతృప్తి మరెక్కడా దొరకలేదు. దీంతో అపన్నులను ఆదుకోవడమే తమ జీవిత గమ్యంగా మార్చుకున్నారు. ఆ దిశగా అనంతపురానికి వచ్చి సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో నిమగ్నమయ్యారు. వారే ఫైట్‌ మాస్టర్లు రామ్, లక్ష్మణ్‌. సాక్షి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ వచ్చారు. అవి ఏమిటో చూద్దామా...        


సాక్షి : సినీ ఫీల్డ్‌ నుంచి ఇటువైపు రావాడానికి కారణం?
రామ్‌లక్ష్మణ్‌ : ఇప్పటికే చాలామంది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు, నిస్సహాయకులకు చేయూతను అందించాలని మాలో మేమే కలలుకంటుండే వాళ్లం. ఆ కలలు సాకారం చేసుకునేందుకు చాల కష్టపడ్డాం. ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నాం.

సాక్షి : హీరో మహేష్‌బాబులా అనంతపురంలో ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా?
రామ్‌లక్ష్మణ్‌ : గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేష్‌బాబు వెనుక హీరో ‘సూపర్‌స్టార్‌’ కృష్ణ ఉన్నారు. మా వెనుక ఎవరూ లేరు. రామ్‌కు లక్ష్మణ్, లక్ష్మణ్‌కు రామ్‌ తప్పా. అనాథలకు చేయూతను అందించాలనే ధృడమైన సంకల్పం మాలో ఉంది. అదే ముందుకు నడిపిస్తోంది.

సాక్షి : జిల్లాలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు?
రామ్‌లక్ష్మణ్‌ : మా గురువు బిక్షుమయ్య ఆదేశాల మేరకు నార్పల మండలంలోని శ్రీసత్యసాయి అనాథ పిల్లల విద్యాలయానికి చేయూతను అందిస్తున్నాం. శిథిలావస్థలో ఉన్న ఈ విద్యాలయానికి ప్రస్తుతం మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యాం. నాలుగు రోజులుగా అదేపనిలో ఉంటున్నాం.

సాక్షి : మీకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో సేవా కార్యక్రమాలు చేయడం కష్టమేమో?
రామ్‌లక్ష్మణ్‌ : మాకు వచ్చే రెమ్యూనిరేషన్‌తో ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం. పేదలకు సహాయం చేయాలనే సంకల్పమే మమ్మల్ని నడిపిస్తోంది. వారి కోసం జోలి కట్టుకుని భిక్షాటన చేస్తాం. వచ్చే నెల అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి, వచ్చిన సొమ్మును అనాథ ఆశ్రమాలకు అందించి ఆ పిల్లల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాం.

సాక్షి : చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం...
రామ్‌లక్ష్మణ్‌ : నేటి సమాజంలో మనుషులు ఎదిగే కొద్ది వారిలో అదే స్థాయిలో స్వార్థం పెరిగిపోతోంది. ఎంత సంపాదించినా  వెనుక తీసుకెళ్లేది ఏముంది? మంచి చెడు తప్పా.  ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడి ఆధ్యాత్మికతతో కూడిన సేవా భావం అలవర్చుకుని పేదలకు చేయూతను అందించేందుకు ముందుకు రావాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి