‘హామ్లెట్’ నాటకం ఆధారంగా సినిమా

26 Sep, 2013 01:31 IST|Sakshi
‘హామ్లెట్’ నాటకం ఆధారంగా సినిమా
పదేళ్ల తర్వాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు టబు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 2003లో విడుదలైన ‘మక్బూల్’ సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న విషయం తెలిసిందే. విలియమ్స్ షేక్స్‌పియర్ రాసిన ‘మాక్‌బెత్’ నాటకం ఆధారంగా ఆ చిత్రం చేశారు విశాల్. 
 
తాజాగా, మరో చిత్రం చేయబోతున్నారు. అది కూడా షేక్స్‌పియర్ రచనే కావడం విశేషం. షేక్స్‌పియర్ రాసిన అద్భుతమైన నాటకాల్లో ఒకటైన ‘హామ్లెట్’ ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రకథ అనుకోగానే ఓ కీలక పాత్రకు టబుని అనుకున్నారట విశాల్. 
 
ఈ మధ్యకాలంలో ఏ సినిమా పడితే అది ఒప్పుకోవడానికి ఇష్టపడని టబు, కథాబలం, మంచి పాత్రలైతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ చిత్రం గురించి విశాల్ చెప్పగానే అలానే చేశారట.
 
ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా నిలిచే పాత్రను టబు చేయబోతున్నారని విశాల్ పేర్కొన్నారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను సంవత్సరాంతంలో ప్రారంభించాలనుకుంటున్నారు.