మికా సింగ్‌పై నిషేధం విధించిన ఏఐసీడబ్ల్యూఏ

14 Aug, 2019 14:12 IST|Sakshi

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) బాలీవుడ్‌ గాయకుడు మికా సింగ్‌పై నిషేధం విధించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చినందుకుగాను మికా సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్‌ మాజీ సైనిక నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ కజిన్‌ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్‌ మికా సింగ్‌ పాల్గొన్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. మికా సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తడం వంటి విషయాలు తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇండియాలోని అన్ని ప్రొడక్షన్ హౌజ్‌లు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రొవైడర్స్ ఇక నుంచి మికా సింగ్‌తో పని చేయకూడదని ఏఐసీడబ్ల్యూఏ ఆదేశించింది. ఒకవేళ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మికా సింగ్‌తో కలిసి పనిచేస్తే.. వారిపై కూడా కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. ఓవైపు కశ్మీర్ విషయంలో భారత నిర్ణయాన్ని పాకిస్తాన్ తప్పు పడుతున్నవేళ.. దేశ ప్రయోజనాల కంటే మికా సింగ్ డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడని.. అందుకే అతనిపై నిషేధం విధించామని ఏఐసీడబ్ల్యూఏ తెలిపింది. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ కూడా ఇందులో జోక్యం చేసుకోవాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది.

>
మరిన్ని వార్తలు