ప్రముఖ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత

28 Dec, 2014 23:07 IST|Sakshi
ప్రముఖ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు(78) శనివారం రాత్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య కల్యాణితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ ఆయన స్వస్థలం. అక్కడే 8వ తరగతి వరకూ చదివిన భాస్కరరావుకు చిన్నప్పట్నుంచీ  సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 1959లో ఆయన మద్రాస్ చేరుకున్నారు. మేటి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, తాపీ చాణక్య, వి.మధుసూదనరావు, భీమ్‌సింగ్ దగ్గర సహాయకునిగా దాదాపు 40 చిత్రాలకు పనిచేశారు. దర్శకునిగా భాస్కరరావు తొలి చిత్రం ‘మనుషులు మట్టి బొమ్మలు’. కృష్ణ, జమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఉత్తమ కథారచయితగా నంది అవార్డును కూడా అందుకున్నారు భాస్కరరావు.
 
  ఇక అప్పట్నుంచీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు తదితర అగ్ర నటులతో 18 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా మోహన్‌బాబు తొలి చిత్రం ‘గృహప్రవేశం’కి భాస్కరరావే దర్శకుడు. ఆ సినిమా విజయంతో నిర్మాతగా మోహన్‌బాబు కెరీర్‌కి బలమైన పునాది ఏర్పడింది. కృష్ణంరాజు కథానాయకునిగా భాస్కరరావు రూపొందించిన ‘ధర్మాత్ముడు’ చిత్రమైతే... అప్పట్లో ఆల్‌టైమ్ హిట్. మురళీమోహన్, జయసుధలతో ఆయన తెరకెక్కించిన ‘కల్యాణ తిలకం’ చిత్రం మహిళామణుల నీరాజనాలు అందుకుంది.
 
 ఇంకా భారతంలో శంఖారావం, రాధా మై డార్లింగ్, చల్‌మోహనరంగా, శ్రీవారు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీరామచంద్రుడు, సక్కనోడు, చదరంగం, ఉమ్మడిమొగుడు, మామాకోడలు... ఇలా చెప్పుకోదగ్గ ఎన్నో చిత్రాలు రూపొందించారు భాస్కరరావు. కెరీర్‌లో ఎక్కువ సినిమాలో కృష్ణంరాజు, జయసుధలతోనే చేశారాయన. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన భాస్కరరావు... 1995 నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశాన వాటికలో భాస్కరరావు అంత్యక్రియలు నేటి ఉదయం జరుగుతాయి.
 
 నా గురువుని కోల్పోయా: దర్శకుడు ఎన్. శంకర్
 సహాయ దర్శకునిగా నా కెరీర్ ఆరంభమైంది భాస్కరరావుగారి దగ్గరే. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘భాగవతంలో శంఖారావం’కి సహాయకునిగా చేశాను. దర్శకత్వ శాఖ గురించి ఎన్నో మెళకువలు నేర్పించిన గురువు. ఆయన్ను కోల్పోవడం బాధాకరం. భాస్కరరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.