పాల్వంచలో సినీతారల సందడి 

28 Sep, 2019 10:09 IST|Sakshi
మాట్లాడుతున్న గౌతంరాజు, కృష్ణంరాజు

సాక్షి, పాల్వంచ: పట్టణంలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు నిర్మాతగా తీసిన ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో సినిమా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా, కోల్‌కతాకు చెందిన హీరోయిన్‌ హెల్సాగోష్, దర్మకుడు శ్రీనాథ్‌లు మాట్లాడారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌తోపాటు ప్రేమకథా చిత్రంగా దీనిని తెరకెక్కించామని, సినిమాను అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేస్తామని తెలిపారు. తెలుగు ప్రజలు దీనిని విజయవంతం చేసి ఆదరించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి హీరోహీరోయిన్లు కృష్ణంరాజు, హెల్సాగోష్‌ నృత్యం చేసి ఉర్రూతలూగించారు. అనంతరం కళాశాల చైర్మన్‌ టి.భరత్‌ చిత్ర బృందానికి జ్ఞాపికలు అందించారు.  

కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌ మార్కెట్‌’ 
చిన్న సినిమా అయినా కొత్త తరహా చిత్రం ‘కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌’ అని నిర్మాత, ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు, హీరో కృష్ణంరా జు అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత గౌతంరాజు మాట్లాడు తూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథ బాగుండటంతో తానే సొంతంగా సినిమా తీసేందుకు ముందుకొచ్చానన్నారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే దానిని రిలీజ్‌ చేయడం ఎంతో కష్టంతో కూడుకుందని, తాను సుమారు 300 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమని, తనలానే తన కొడుకు హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఇందులో కీలక పాత్రదారులుగా తనికెళ్ల భరణి, బెనర్జీ, సన, రవి ప్రకాష్‌ నటించగా, ఎడిటర్‌ వెంకటేశ్వరరావు, ఫైట్స్‌ సింధూరం సతీశ్‌ సమకూర్చారని చెప్పారు. అనంతరం కృష్ణంరాజు మాట్లాడారు. సినిమాలో అర్జున్‌ పాత్ర బాక్సర్‌ కావడంతో 6 ఫైట్స్‌ ఎలాంటి డూప్‌ లేకుండా చేశానని తెలిపారు. హీరోయిన్‌ హెల్సాగోష్‌ మాట్లాడుతూ కన్నడంలో మొత్తం 11 సినిమాల్లో నటించానని, తెలుగులో ఇది తన మొదటి సినిమా అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు