సుశాంత్‌ చాలా హుందాగా ప్రవర్తించేవాడు

15 Jun, 2020 03:29 IST|Sakshi

– భూమిక

‘ఎం.ఎస్‌. ధోనీ’ చిత్రంలో సుశాంత్‌కి అక్క పాత్ర చేశారు... తన మృతి గురించి తెలిసి... (మధ్యలో అందుకుంటూ)... షాకయ్యాను. నేను వార్తలు చూడలేదు. ఫోన్‌లో వాట్సప్‌ మేసేజ్‌ ద్వారా తెలుసుకున్నాను. సుశాంత్‌ అలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. చిన్న వయసులోనే ఓ ప్రతిభా వంతుడైన యాక్టర్‌ మనకు దూరం కావడం చాలా బాధాకరం.

► ఆ సినిమా సెట్‌లో సుశాంత్‌ డల్‌గా ఉన్న సందర్భాలు కానీ లేదా అతనిలో కుంగుబాటుకు సంబంధించిన లక్షణాలేమైనా కనిపించాయా?
సుశాంత్, నేను 9 నుంచి 10 రోజులు మాత్రమే కలసి పని చేశాం. సుశాంత్‌ చాలా మంచి నటుడు. ఏ సన్నివేశంలోనైనా సుశాంత్‌ బాగా నటించగలడని నాకు అనిపించింది. కష్టమైన సీన్స్‌కు కూడా పెద్దగా టైమ్‌ తీసుకునేవాడు కాదు. సెట్‌లో కొన్నిసార్లు మేడమ్‌ అని, కొన్నిసార్లు అక్కా అని పిలిచేవాడు. సెట్‌లో అందరితోనూ హుందాగా ప్రవర్తించేవాడు. నైస్‌ పర్సన్‌. మెచ్యూర్డ్‌. కాకపోతే కాస్త రిజర్డ్వ్‌గా ఉండేవాడు.

► ఈ మధ్య సుశాంత్‌తో మాట్లాడారా?
లేదు. అయితే అతన్ని ట్వీటర్‌లో ఫాలో అవుతున్నాను. కొన్నిసార్లు ట్వీటర్‌లో అంత యాక్టివ్‌గా కూడా ఉండడు. ఏడాది క్రితం అనుకుంటా.. ట్వీటర్‌కి దూరం అవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత నుంచి ట్వీటర్‌లో కూడా తనతో టచ్‌లో లేను.

► జీవితాన్ని డీల్‌ చేయలేని స్థితిలో సుశాంత్‌ ఉన్నారని అనుకుంటున్నారా?
అంత దూరం తన గురించి తెలియదు. అయితే మనందరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మనం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు బంధువులతోనో, మిత్రులతోనే మాట్లాడాలి. అప్పుడు మనం ఆ స్థితి నుంచి బయటకు వస్తాం.

► సుశాంత్‌లా కొందరు యువనటీన టులు ఆత్మహత్య చేసుకున్నారు... యంగ్‌స్టర్స్‌కి మీ సందేశంగా ఏం చెబుతారు?
మన జీవితాల్లోని అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కష్టనష్టాలు ఉంటాయి. యంగ్‌స్టర్స్‌ డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఉండాలంటే ఎక్కువగా ఒంటరిగా గడపకూడదు. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులతో వారి సమస్యలను డిస్కస్‌ చేయాలి. పరిష్కారం ఆలోచించాలి. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పక్కవారి సాయం తీసుకోవచ్చు.. తప్పేం లేదు.

► కష్టాలు చెప్పుకునే వ్యక్తి ఒక్కరు కూడా లేనివాళ్లు ఏం చేయాలి?
కొన్నేళ్ల క్రితం ఇలాంటి టాపిక్‌ ఒకటి వస్తే.. నా దగ్గర ఒక వ్యక్తి ఇలా చెప్పారు. ‘మనసు బాగాలేనివాళ్లు దేని మీదా దృష్టి పెట్టరు. అయితే రెగ్యులర్‌గా చేసినట్లే ప్రతి రోజూ స్నానం చేయాలి.. వ్యాయామం చేయాలి.. ప్రార్థించాలి. రోజులో 45 నిమిషాలు ఇంట్లో కాకుండా బయట గడపాలి. అప్పుడు వాళ్ల మనసు కొంచెం తేలిక అవుతుంది’ అని. ఇలా చేయడం వల్ల ఒకే విషయం మీద దృష్టి మళ్లకుండా కొంచెం మనసుని డైవర్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

సుశాంత్‌కి ప్రముఖుల నివాళి
సుశాంత్‌ మంచి ప్రతిభావంతుడు. చాలా తొందరగా వెళ్లిపోయాడు.
– మహేశ్‌బాబు

చాలా తొందరగా ఓ గొప్ప ప్రతిభావంతుణ్ణి కోల్పోయాం.   
– ఎన్టీఆర్‌

నటుడిగా ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన సుశాంత్‌ ఇంత తొందరగా మరణించాడని తెలిసి షాకయ్యాను.   
– రామ్‌చరణ్‌
కెరీర్‌లో చాలా దూరం ప్రయాణించాల్సిన సుశాంత్‌ ఇంత తొందరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది.
– ప్రకాశ్‌రాజ్‌

‘చిచోరే’ సినిమా సెట్స్‌లో సుశాంత్‌ని కలిశాను. సినిమా పూర్తయ్యేసరికి తను నాకో బ్రదర్‌లా దగ్గరయ్యాడు. హిందీలో నాకది మొదటి సినిమా అయినా ఆ భావనను తను ఎప్పుడూ నాకు కలిగించలేదు. నేను నా సోదరుడిని మిస్‌ అవుతున్నాను.
– నవీన్‌ పొలిశెట్టి

వ్యక్తిగతంగా సుశాంత్‌ నాకు తెలియదు. కానీ అతని సినిమాలు చూస్తే నాకు అర్థమయ్యింది. అతను ఎంత మంచి నటుడో. ఎవరి హృదయంలో ఏ బాధ దాగి ఉందో కనిపెట్టలేం. మానసికంగా ఎవరైనా బలహీనంగా ఉంటే దయచేసి మీ బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు.. ఇలా మీరు నమ్మకం ఉంచిన ఎవరితోనైనా సరే మీ భావాలను పంచుకుని మీ బాధను తగ్గించుకోండి.
– అనిల్‌ కపూర్‌

సుశాంత్‌ నన్ను చాలా ఇష్టపడే వ్యక్తి. యాక్టింగ్‌లో అతని ఎనర్జీ, అందమైన చిరునవ్వు బాగుంటాయి. సుశాంత్‌ మరణం నన్ను బాధించింది. బాగా మిస్‌ అవుతున్నాను.   
– షారుక్‌ ఖాన్‌

సుశాంత్‌ మరణవార్త విని షాకయ్యాను. మాటలు రావడం లేదు. మంచి ప్రతిభావంతుడ్ని కోల్పోయాం.
– అక్షయ్‌ కుమార్‌

‘సోంచరియా’ చిత్రం కోసం అతనితో కలిసి నటించిన రోజులు ఇంకా నా కళ్ల ముందే కదులుతున్నాయి. మా ఇంట్లో నా చేతి వంట తినాలని సుశాంత్‌ నాతో ఓ సందర్భంలో చెప్పాడు. అది నెరవేరనందుకు బాధగా ఉంది.
    – మనోజ్‌ భాజ్‌పాయ్‌

గత ఏడాదిగా నీతో నేను సరిగా టచ్‌లో ఉండనందుకు నన్ను నేను నిందించుకుంటున్నాను. నీ భావాలను పంచుకునేందుకు నీ జీవితంలో ఎవరైనా ఉంటే బాగుండేదని అనుకున్నాను.
– కరణ్‌ జోహార్‌

మంచి నటుడు, నా స్నేహితుడిని కోల్పోయాను.
– నవాజుద్దీన్‌ సిద్ధిఖీ
‘ధోని’ సినిమా షూటింగ్‌లో నీతో (సుశాంత్‌) గడిపిన సరదా సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి. అవి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. నీ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది.
– కియారా అద్వానీ

నేను హీరోయిన్‌గా నటించిన నా తొలి సినిమాలో సుశాంత్‌ నా కో స్టార్‌. సుశాంత్‌ మరణ వార్త విని నా హృదయం బద్దలైంది.  
– వాణీకపూర్‌

మరికొందరు సెలబ్రిటీలు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై స్పందించి, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

మరిన్ని వార్తలు